ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్

national |  Suryaa Desk  | Published : Sun, Mar 31, 2024, 10:01 PM

టైమ్స్ నౌ మేనేజింగ్ ఎడిటర్ వినీత్ జైన్‌‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు 2023 లభించింది. భారతీయ టీవీ న్యూస్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా.. ఎక్స్ఛేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అవార్డ్స్ (ఈఎన్‌బీఏ) వినీత్ జైన్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. శనివారం న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో వినీత్ జైన్ మాట్లాడుతూ... తనకు అవార్డు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తనకు లభించిన ఈ అవార్డును టైమ్స్ గ్రూప్‌ ఉద్యోగులకు, తన సోదరుడు సమీర్ జైన్‌కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.


  ‘‘నేను టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లోకి అడుగుపెట్టినప్పుడు.. నాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాంటి పురస్కారాలు లభిస్తాయని నేను అనుకోలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా, గుర్తింపు కోరుకోకుండా బాగా పని చేయడాన్ని నేను నమ్ముతాను. నాకు లైఫ్ టైమ్ అచీవ్‌‌మెంట్ అవార్డు వచ్చిందని అనురాగ్ చెప్పినప్పుడు.. ఇది నాకు ఎంతో త్వరగా వచ్చిందని జోక్ చేశాను. నేను సాధించాల్సింది ఇంకెంతో ఉంది. పని చేయడాన్ని నేను ఇష్టపడతాను. ఈ అవార్డును నేను టైమ్స్ గ్రూప్‌ టీమ్స్‌కు అంకితం ఇస్తున్నాను. టైమ్స్ గూప్‌ను విస్తరించడంలో మా అన్నయ్య సమీర్ జైన్ నాకు ఎంతగానో మద్దతుగా నిలిచారు’’ అని వినీత్ జైన్ వ్యాఖ్యానించారు.


‘మీడియా స్వేచ్ఛగా పని చేయాలని.. బలంగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఉండాలనేది నా ప్రగాఢ విశ్వాసం. మనం స్వేచ్ఛగా ఉండాలంటే బలంగా ఉండాలి. మీడియా పరిశ్రమను, సంస్థలను బలోపేతం చేయడానికి నేను అంకితభావంతో పని చేస్తాను’ అని వినీత్ జైన్ తెలిపారు.


టైమ్స్ గ్రూప్ విస్తరణలో కీలక పాత్ర..


టైమ్స్ గ్రూప్ విస్తరణలో వినీత్ జైన్ కీలక పాత్ర పోషించారు. న్యూస్ పేపర్, మ్యాగజైన్‌గా ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాను ఇతర విభాగాల్లోకి విస్తరించారు. రేడియో మిర్చీ (ఎఫ్ఎం రేడియో), టైమ్స్ ఇంటర్నెట్ (ఇంటర్నెట్), టైమ్స్ నెట్‌వర్క్ (టీవీ)లను ఆయా రంగాల్లో దేశంలోకెల్లా అతిపెద్ద కంపెనీలుగా ఆయన తీర్చిదిద్దారు. వీటితోపాటు.. టైమ్స్ మ్యూజిక్, ఫిల్మ్స్ (జంగ్లీ పిక్చర్స్), ఈవెంట్స్ (టీఎస్ఎస్‌ఎల్), ఔట్ డోర్ మీడియా (టైమ్స్ ఓఓహెచ్), మ్యాజిక్ బ్రిక్స్ మొదలైనవి.. తమ తమ రంగాల్లో సత్తా చాటడంలో వినీత్ జైన్ కృషి ఎంతో ఉంది. చీఫ్ కంటెంట్ ఆర్కిటెక్ట్‌గా దశాబ్దాలపాటు పని చేసిన వినీత్ జైన్ మీడియాలోని ప్రతి విభాగంలో నంబర్ వన్ బ్రాండ్లుగా టైమ్స్ గ్రూప్ సంస్థలను తీర్చిదిద్దారు. వినీత్ జైన్ సారథ్యంలో టైమ్స్ గ్రూప్ మీడియా పరిధిని దాటి హయ్యర్ ఎడ్యుకేషన్ (బెన్నెట్ యూనివర్సిటీ), ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ (టైమ్స్ ప్రో) లాంటి ఇతర విజ్ఞాన రంగాలకు కూడా విస్తరించింది.


జ్యూరీ ప్రశంసలు..


టైమ్స్ గ్రూప్‌లోని టీవీ ప్లాట్‌ఫామ్స్ అయిన టైమ్స్ నౌ, ఈటీ నౌ, మిర్రర్ నౌ, టైమ్స్ నౌ నవభారత్, ఈటీ నౌ సద్వేశ్ లాంటి ఛానెళ్లను ఏర్పాటు చేసిన వినీత్ జైన్.. భారతదేశ టెలివిజన్ న్యూస్ మీడియా స్వరూపాన్ని మార్చారని అవార్డు జ్యూరీ కొనియాడింది. వినూత్న కార్యక్రమాల నిర్వహణ, కవరేజీ విషయంలో సమతూకం పాటించడంలో జైన్ నిబద్ధతతో వ్యవహరించారని జ్యూరీ తెలిపింది. చక్కటి పని వాతావరణాన్ని పెంపొందించడం, టైమ్స్ నెట్‌వర్క్‌ అత్యుత్తమ పాత్రికేయ ప్రతిభను ఆకర్షించడంలో వినీత్ అసాధారణ సామర్థ్యం కనబర్చారని జ్యూరీ ప్రశంసించింది.


ఈఎన్‌బీఏ జ్యూరీలో..


సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ (రిటైర్డ్), exchange4media అండ్ బిజినెస్ వరల్డ్ ఛైర్మన్ & చీఫ్ ఎడిటర్ డాక్టర్ అనురాగ్, కాంపిటీషన్ అడ్వైజరీ సర్వీసెస్ (ఇండియా) ఎల్ఎల్‌పీ చైర్మన్ ధనేంద్ర కుమార్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అలోక్ మెహతా తదితరులు ఈఎన్‌బీఏ జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com