టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో జోరుపెంచారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తూ ప్రజాగళం బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపైనా ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారు. మెగా డీఎస్సీపైనా తొలి సంతకం అంటూ ఇప్పటికే నిరుద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆదివారం మరో హామీ ఇచ్చారు. అయితే ఈసారి మార్కాపురం ప్రజలకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే
మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ప్రకటించారు.
మార్కాపురం డివిజన్‌లో ఎక్కువగా పేదరికం ఉందన్న చంద్రబాబు.. మార్కాపురానికి నీళ్లు అందించాలనే ఉద్దేశంతోనే వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే వెలిగొండ ప్రాజెక్టులోని 20 శాతం పెండింగ్ పనులను కూడా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న టీడీపీ అధినేత.. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడిందని చంద్రబాబు విమర్శించారు. ఏపీ ప్రజల నెత్తిన 13 లక్షల కోట్ల అప్పు తెచ్చిపెట్టారని మండిపడ్డారు. మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, మెగా డీఎస్సీ ఇలా హామీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. రోజూ బటన్ నొక్కుతున్నామని చెప్పుకునే ముఖ్యమంత్రికి బటన్ నొక్కడం వలన పేదలకు వచ్చింది ఎంత.. తాను బొక్కింది ఎంతో చెప్పే దమ్ముందా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని ప్రకటించారు.
మరోవైపు మార్కాపురంలో వచ్చిన స్పందన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు.. ఈ సభ ద్వారా ప్రజల నాడి తెలిసిపోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఖాయమని.. ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయమని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికలకు కూటమిగా వస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.