పుట్టిన రోజు నాడే ఓ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. బర్త్ డే కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్ తిన్న తర్వాత అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. కేక్ విషపూరితం కావడంతో ఆ చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేక్‌ను తిన్న అందరూ అనారోగ్యం బారిపడినట్టు తెలిపారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు బేకరీ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్చి 24న జరిగిన పంజాబ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. పటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు జరిపించారు. ఆన్‌లైన్‌లో ఓ బ్యాకరీ నుంచి కేక్ ఆర్డర్ చేశారు. ఆ కేక్‌ను సాయంత్రం 7 గంటలకు కట్ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. అయితే, రాత్రి 10 గంటలకు అందరూ అస్వస్థతకు గురయ్యారు. గొంతు తడారిపోతోందంటూ చిన్నారి మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. తెల్లారేసరికి ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆ పాపను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కేక్ విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాన్వి తాత హర్బన్ లాల్ మాట్లాడుతూ.. కేక్ తిన్న తర్వాత మా సోదరి వాంతులు చేసుకుంది. మాన్వి దాహంగా ఉందని, గొంతు తడారిపోతుందని నీళ్లు కావాలని అడిగింది అని చెప్పారు. ఉదయానికి తన మనవరాలి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ ఐసీయూలో చేర్చి చికిత్స చేసినా ప్రాణం దక్కలేదని వాపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో బేకరీ యజమానిపై ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షలకు పంపారు. ఫలితాలు రావాల్సి ఉందని, నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.