ఖరీదైన వాచ్ ఓ దేశాధ్యక్షురాలిని చిక్కుల్లో పడేసింది. ఎన్నికైనప్పుడు రికార్డుల్లో చూపించని ఖరీదైన ఆ చేతి గడియారాన్ని అధ్యక్షురాలు ధరిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. వీటి ఆధారంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అధ్యక్షురాలి అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆమె అవినీతికి పాల్పడారా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే, సోదాలు జరుగుతున్న సమయంలో ఆమె తన నివాసంలో లేకపోవడం గమనార్హం. శనివారం తెల్లవారుజామున పెరూ అధ్యక్షభవనంలో అధికారులు సోదాలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పెరూ అధ్యక్షురాలు డీనా బొలువార్టే చేతికి పెట్టుకునే ఖరీదైన రోలెక్స్ వాచీపై మీడియాలో కథనాలు రావడంతో ఆమె ఇంటికి అవినీతి నిరోధకశాఖ అధికారులు చేరుకోవడం, సోదాలు జరిపిన దృశ్యాలు స్థానిక మీడియా ప్రసారమయ్యాయి. 20 మంది అధికారులు, 20 మంది పోలీసులు అధ్యక్ష భవనంలో సోదాలు నిర్వహించారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలోనే సోదాలు నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. పెరూ అధ్యక్షురాలిగా డీనా బొలువార్టే డిసెంబర్ 2022లో బాధ్యతలు చేపట్టారు.
ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి అప్పటి అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో ప్రయత్నించారు. దీంతో ఆయన్ని అధికారం నుంచి తొలగించి.. డీనా అధ్యక్షపగ్గాలు చేపట్టారు. పెరూ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలు రుజువైనప్పటికీ.. పదవీ కాలం ముగిసే వరకు చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో జులై 2026 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగనున్నారు.
ఇదిలా ఉండగా, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను అధ్యక్షురాలు కొట్టిపారేశారు. ప్రభుత్వ ధనంతో అంత ఖరీదైన వస్తువులు ఎలా కొనుగోలు చేశారని గత వారం ఆమెను మీడియా ప్రశ్నించగా.. ‘ప్రజాధనంతో కొనుగోలు చేయలేదు.. 18 ఏళ్ల వయసు నుంచి కష్టపడుతున్నా.. స్వశక్తితోనే ఖరీదైన వస్తువులు కొనుక్కున్నా. స్వచ్ఛంగా అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టా.. మకిలి లేకుండానే ఇక్కడి నుంచి వెళ్తా’ అని ఆమె సమాధానం ఇచ్చారు.
మరోవైపు, ఈ సోదాలపై పెరూ ప్రధాని గుస్టావో ఆండ్రియాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఇది తీవ్రమైన చర్య.. పెట్టుబడులు, మొత్తం దేశాన్ని ప్రభావితం చేస్తుంది.. గత కొన్ని గంటల్లో జరిగింది అసమాన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు’ అని మండిపడ్డారు. కాగా, సోదాలు సమయంలో అధ్యక్ష భవనంలోని సిబ్బంది పూర్తిగా సహకరించారని పెరూ అధ్యక్ష నివాసం ఓ ప్రకటన విడుదల చేసింది.