గుజరాత్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దేవభూమి ద్వారకలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనమయ్యారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. ద్వారక నగరం ఆదిత్య రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో తెల్లవారుజామున 3.30 గంటలకు మంటలు చెలరేగాయి. ఎయిర్ కండీషనర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. దీంతో దట్టంగా పొగ కమ్మేసి వారు బయటకు వచ్చే అవకాశం లేక గదిలోనే ఊపిరాడక చనిపోయారు. ప్రమాదం గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలిలో ఓ వ్యక్తి, అతడి భార్య, ఎనిమిది నెలల కుమార్తె, మరో మహిళ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రిస్తున్న వారి నాయినమ్మ మాత్రం ప్రాణాలతో బయటపడింది. మృతులను పవన్ ఉపాధ్యాయ్ (39), ఆయన భార్య తిథి (29), తల్లి భవానీబెన్ (69), ఎనిమిది నెలల కుమార్తె ధైనాగా గుర్తించారు.