ఓ హత్య కేసు మిస్టరీ రైలు ప్రయాణికుడు తీసుకున్న సెల్ఫీతో వీడింది. మహారాష్ట్రలోని కల్యాణ్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి మొబైల్ ఎత్తుకెళ్లేందుకు దొంగ ప్రయత్నించాడు. అదే సమయంలో ప్రయాణికుడి సెల్ఫీ వీడియోలో చిక్కి హత్యకేసు కింద అరెస్టయ్యాడు. జాహిద్ జైదీ రైలులో సెల్ఫీ వీడియో తీసుకొంటూ ఉండగా.. ఓ దొంగ మొబైల్ అపహరించే ప్రయత్నం చేశాడు. జాహిద్ వెంటనే అప్రమత్తం కావడంతో దొంగ పారిపోయాడు. ఈ సీన్ మొత్తం సెల్ఫీ వీడియోలో రికార్డ్ అయింది. వైరల్‌గా మారిన ఈ వీడియో కల్యాణ్ రైల్వే పోలీసుల దృష్టికి వెళ్లి నిందితుణ్ని అరెస్టు చేశారు.
అతడి దగ్గర ఉన్న మొబైల్ స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. ఇటీవల జరిగిన అనుమానాస్పద మృతికి అసలు కారణం తెలిసింది. నిందితుణ్ని ఠాణెకు చెందిన జాదవ్‌గా గుర్తించారు. అతడి దగ్గర ఉన్న మొబైల్‌ను స్విచ్చాన్ చేసి.. అది పుణెకు చెందిన ప్రభాస్ భాంగేకు చెందినదిగా తేల్చారు. బ్యాంకు ఉద్యోగి అయిన ప్రభాస్ హోలీ కోసం పుణె నుంచి కల్యాణ్‌లోని తన ఇంటికి వచ్చాడు.
అనంతరం ప్రభాస్ మార్చి 25 అర్ధరాత్రి పుణెకు తిరిగివెళుతూ విఠల్‌వాడి రైల్వేస్టేషనులో రైలు నుంచి పడి చనిపోయాడు. మొదట అనుమానాస్పద మృతిగా భావించగా.. ప్రభాస్ మొబైల్‌ను జాదవే దొంగిలించాడు. ఆ ఫోను తిరిగి లాక్కోడానికి చేసిన ప్రయత్నంలో కదులుతున్న రైలులోంచి కిందపడి ప్రభాస్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి ఓ సెల్ఫీ హత్య కేసులో నిందితుడ్ని పోలీసులకు పట్టించింది.