పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం తుపాను బీభత్సం సృష్టించింది. ఈ భారీ తుపాను, వడగళ్లతో జలపాయిగురి జిల్లాలో అనేక ఇళ్లు కూలిపోయాయి. తుపాను కారణంగా ఐదుగురు మృత్యువాతపడ్డారు.సుమారు 500 మందికి గాయాలు అయ్యాయి. గుడిసెలు కూలిపోయి, చెట్లు నేలకొరిగాయి.ఆదివారం రాత్రి సీఎం మమతా బెనర్జీ బాగ్‌దోగ్రా ప్రాంతంలో తుపాను పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. తుపాను సంభవించిన ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వం బాధితులకు అన్ని రకాలుగా సాయం అందిస్తుందని ఆమె పేర్కొన్నారు.జిల్లా ఉన్నతాధికారులు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తారని తెలిపారు.గాయపడిన బాధితుల పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి డాక్టర్లు, నర్సులు, ఆస్పత్రులు తీవ్రంగా శ్రమిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న చోట అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జలపాయిగురితో పాటు పక్కనే ఉన్న అలియుపుర్‌దువార్ కూచ్ బెహార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తుపాను, వడగళ్ల ప్రభావం చూపిందని, కాని ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.