తిరుమల ఘాట్ రోడ్డులో మరోసారి ప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ చనిపోయిన ఘటన మరువకముందే ఘాట్ రోడ్డులో మరోసారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండో ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. వెంకన్న స్వామి దయవలనే పెద్ద ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నారు.
తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే రోడ్డుపై ఉన్న గ్రీజు మరకలే ప్రమాదానికి కారణమని సమాచారం. గ్రీజు కారణంగా బస్సు అదుపు తప్పిందనీ.. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లు తెలిసింది. గ్రీజు మీద నుంచి వెళ్లిన బస్సు అదుపు తప్పి లోయవైపు దూసుకెళ్లినట్లు తెలిసింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఓ చెట్టును ఢీకొట్టారు. దీంతో బస్సు పిట్టగోడ మీద ఆగిపోయింది. ఘటన తర్వాత మరో వాహనంలో భక్తులను అక్కడి నుంచి తరలించారు.
ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తిరుమలేశుడి దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా ప్రమాదం జరగ్గా .. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. చెట్టును ఢీకొట్టపోతే బస్సు లోయలోకి దూసుకెళ్లేదని ప్రయాణికులు చెప్తున్నారు. శ్రీవారి దయవలన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డామని చెబుతున్నారు.
మరోవైపు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బెంగుళూరు చెందిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం మూడు కార్లలో వచ్చారు. మొత్తం పది మంది కుటుంబ సభ్యులు మూడు కార్లలో తిరుమలకు వచ్చారు. స్వామి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి అడవిలోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో భవాని అనే మహిళ చనిపోగా .. ఆమె భర్త మురళీధర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పిల్లలకూ స్వల్ప గాయాలయ్యాయి.