తెలుగురాష్ట్రాలలో గంజాయి అక్రమ రవాణా గుట్టుగా సాగిపోతోంది. పోలీసులు ఎంతగా నిఘాపెట్టినా దుండగులు మాత్రం సరుకును చేర్చాల్సిన ప్రదేశానికి చేరుస్తున్నారు. చెక్ట్ పోస్టుల వద్ద నిఘాను సైతం బురిడీ కొట్టిస్తూ అనుకున్న ప్రదేశానికి సరుకును తరలిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో నిఘాను మరింత పెంచిన పోలీసులు.. గంజాయి అక్రమ సరఫరా మీద ఉక్కుపాదం మోపుతున్నారు. నిఘావర్గాల ద్వారా సమాచారం అందుకుంటూ గంజాయిని ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లూరి జిల్లాలో 500 కేజీలకు పైగా గంజాయి పట్టుబడటం కలకలం రేపింది.
అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చీడిపాలెం గ్రామం వద్ద 27 లక్షలు విలువ చేసే 554 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు.. దుండుగులు వస్తున్న మార్గంలో మాటు వేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 554 కేజీల గంజాయిని గుర్తించారు. ఓ వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి తరలిస్తున్న ముఠా నుంచి 554 కేజీల గంజాయి, ఒక జీపు, రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించామన్న పోలీసులు.. గంజాయిని ఒడిశా రాష్ట్రంలో సేకరించి తునికి చేరవేస్తున్నట్లు తెలిపారు. కొంత దూరం జీపులో.. మరికొంత దూరం కూలీల సాయంతో ఒడిశా నుంచి ఏపీలోకి తీసుకువచ్చిన దుండగులు.. జీపు ద్వారా తునికి చేర్చేందుకు ప్రయత్నిస్తూ చీడీపాలెం వద్ద దొరికిపోయినట్లు పోలీసులు చెప్పారు. యువత దురలవాట్లకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని.. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి రవాణాకు పాల్పడవద్దని పోలీసులు సూచించారు. గంజాయి కేసులో పట్టుబడితే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు బెయిల్ మంజూరు కాదని.. ఎవరూ గంజాయి జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు.