విశాఖలో వన్య ప్రాణుల అక్రమ రవాణా కలకలంరేపింది. వన్యప్రాణుల్ని బంధించి క్రయవిక్రయాలు చేస్తున్న ముఠా ఆటకట్టించారు విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. విశాఖలోని సంతోష్‌నగర్‌కు చెందిన పిల్లా నాగేశ్వరరావు, గోపాలపట్నంలో పెంపుడు జంతువుల విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడిపై ఫిర్యాదులు అందడంతో టాస్క్‌ఫోర్స్, గోపాలపట్నం పోలీసులు దుకాణంతో పాటు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 15 నక్షత్ర తాబేళ్లు, రెండు నెమళ్లు, దుప్పి కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు.
గాజువాక ప్రాంతానికి చెందిన గొందేశి శ్రీనివాసరావు నుంచి నక్షత్ర తాబేళ్లను కొనుగోలు చేసినట్లు నాగేశ్వరరావు చెప్పడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న జీవులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు చెప్పడానికి నిరాకరించిన పోలీసులు.. నిందితులను విచారించిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల చైన్నెకు చెందిన యువర్ ఫ్రండ్స్ అనే సంస్థ నుంచి నాగేశ్వరరావు రెండు తాబేళ్లు, శ్రీనివాసరావు 13 తాబేళ్లు తెప్పించారు. నాగేశ్వరరావు ఆరు నెలల క్రితం నర్సీపట్నం నుంచి నాలుగు నెమలి గుడ్లను తీసుకొచ్చి కోడితో పొదిగించాడు. అందులో రెండు గుడ్లు పిల్లలయ్యాయి. వాటిని సరదాగా పెంచుకుంటున్నానని చెబుతున్నాడు. నక్షత్ర తాబేలు ఒక్కొక్కటి రూ.25 వేలు నుంచి రూ.50 వేలు వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు.
వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం వీటిని క్రయ విక్రయాలు చేపట్టడం నిషేధమని పోలీసులు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. వాటిని సంరక్షణ నిమిత్తం ఫారెస్ట్ అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. నాగేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీనివాసరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.