ట్రెండింగ్
Epaper    English    தமிழ்

400 కాదు.. కనీసం 200 సీట్లైనా గెలవండి.. బీజేపీకి దీదీ ఓపెన్ ఛాలెంజ్

national |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2024, 10:35 PM

సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామంటూ బీజేపీ చేస్తున్న ప్రకటనలపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ కనీసం 200 స్థానాల్లోనైనా విజయం సాధించి చూపెట్టాలని సవాల్‌ విసిరారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200 స్థానాలు గెలుస్తామన్న బీజేపీ 77 సీట్లకే పరిమితమైందని ఈ సందర్భంగా దీదీ గుర్తుచేశారు. టీఎంసీ ఆదివారం కృష్ణానగర్‌లో ఎంపీ మహువా మొయిత్రాకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం, బీజేపీలపై బెంగాల్ సీఎం విమర్శలు గుప్పించారు.


‘‘400 సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోంది.. కానీ, వాళ్లకు 200 సీట్లు కూడా దాటవని నేను సవాల్ విసురుతున్నాను.. 2022 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లోనూ 200 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలికారు.. కానీ 77 సీట్లు మాత్రమే వచ్చాయి.. వారిలో కొంత మంది మా పార్టీలో చేరారు’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే మొయిత్రాపై దుష్ప్రచారం చేసి లోక్‌సభ నుంచి బహిష్కరించారని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. మళ్లీ ఆమెను కృష్ణానగర్‌ నుంచే బరిలో దించామని పేర్కొన్నారు. పారసత్వ సవరణ చట్టంపై కూడా మోదీ అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.


‘సీఏఏపై మోదీ హామీ జీరో గ్యారెంటీ... చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చడానికి సీసీఏ ఒక ఉచ్చు. దానిని అమలు చేసిన తర్వాత NRC తీసుకొస్తారు... మేము పశ్చిమ బెంగాల్‌లో CAA లేదా NRC రెండింటినీ అనుమతించం... కేంద్ర ప్రభుత్వ తప్పుడు హామీలకు పడిపోకండి.. మీరు దరఖాస్తు చేస్తే ఐదేళ్ల పాటు విదేశీయులుగా పరిగణంపబడతారు’ అని మమత పేర్కొన్నారు.


ఇటీవల ప్రమాదవశాత్తూ ఇంటిలో జారపడి తలకు గాయమై కోలుకున్న తర్వాత తొలిసారి దీదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక, తూర్పు పాకిస్థాన్‌ (బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చిన మతువా వర్గాలను ఉద్దేశించి దీదీ మాట్లాడుతూ ..‘మతువా ప్రజలారా. .నాపై నమ్మకం ఉంచండి.. మీ పౌరసత్వాన్ని దూరం చేయడానికి నేను అనుమతించను.. మీకు ప్రశాంతంగా జీవించాలని ఉంటే సీఏఏకు దరఖాస్తు చేయకండి’ అని పేర్కొన్నారు. ‘మహువా మొయిత్రాను మీరు ఎన్నకున్నప్పటికీ ఆమెను అనాలోచితంగా బహిష్కరించారు.... మేము ఆమెను ఈ స్థానం నుంచి మళ్లీ నిలబెట్టాం.. పార్లమెంట్‌లో బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పిన మహువాను బహిష్కరించారు.. మీరు రికార్డు మెజార్టీతో ఆమెను గెలిపించాలి’ అని అన్నారు.


ఇక, హిందువుల్లో వెనుకబడిన వర్గమైన మతువా.. బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో అక్కడ జరిగిన మత హింస నుంచి తప్పించుకుని భారత్‌లోకి వచ్చింది. 90వ దశకం నుంచి రాజకీయ పార్టీలు మతువా వర్గం మద్దతు కోసం పాకులాడుతున్నాయి. ముఖ్యమంగా సీఏఏపై బీజేపీ వైఖరికి అనుగణంగా మైనారిటీలకు సమానమైన విలువైన ఓటు బ్యాంకుగా వీరు మారిపోయారు. మరోవైపు, బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని, ఇక్కడ సీపీఎం, కాంగ్రెస్‌లు బీజేపీ కోసం పని చేస్తున్నాయని మమత ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com