ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి తెరలేసింది. దీంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రచార రంగంలోకి దూకుతున్నారు. ఓటర్లను ఆకర్షించేలా రకరకాల పథకాలతో ఎన్నికల మేనిఫేస్టోను ప్రకటిస్తున్నారు. డబ్బులు, మద్యం, గిఫ్ట్‌లు ఇలా రకరకాలుగా ఎన్నికల ప్రచారంలో పంచుతారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఈ పథకం తెస్తాం.. ఆ పథకం తెస్తాం.. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, ఆర్థిక సాయం చేస్తామని వివిధ హామీలు గుప్పిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ అభ్యర్థి ఇచ్చిన హామీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లోక్‌సభకు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఓ మహిళా అభ్యర్థి.. తాను ఈ ఎన్నికల్లో గనక గెలిస్తే పేద ప్రజలకు విదేశీ విస్కీ, బీరు ఫ్రీగా పంపిణీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఇది విన్న వారంతా ఇదేం హామీరా బాబు అంటూ నోరెళ్లబెడుతున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్ గ్రామానికి చెందిన వనితా రౌత్ ఈ వినూత్న హామీని ఇచ్చారు. ఎక్కడెక్కడ గ్రామాలు ఉంటాయో అక్కడ బీర్ బార్లు ఉంటాయని.. రేషన్ షాపుల మాదిరిగా మద్యం పంపిణీ ఉంటుందని చెప్పారు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో చంద్రపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వనితా రౌత్.. తాను అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఖరీదైన విస్కీ, బీరును ఉచితంగా ఇస్తానంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా తాను గెలిస్తే ఎంపీ ఫండ్స్ నుంచి ప్రతీ గ్రామంలో బీరు బార్‌లను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆల్ ఇండియా హ్యుమానిటీ పార్టీ మద్దతు గల ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి వనితా రౌత్.. చంద్రపూర్ నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి హామీ ఇచ్చారు. ఇక మరికొందరికి సబ్సిడీతో విదేశీ మద్యం, బీర్లను ఇస్తామని చెప్పారు.
మద్యపాన నిషేదం చేస్తామని సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీలు హామీలు ఇస్తుంటే.. ఇలా ఫ్రీ మద్యం ఏంటని అడిగిని ప్రశ్నకు కూడా వనితా రౌత్ సమాధానం ఇచ్చారు. పేద ప్రజలు రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి పూట మద్యం సేవిస్తారని.. అందులోనే వారికి సంతృప్తి ఉంటుందని తెలిపారు. అయితే అలాంటివారు ఖరీదైన మద్యం కొనుక్కోలేక చీప్ లిక్కర్ తాగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారని అందుకే ఖరీదైన, విదేశీ మద్యాన్ని వారికి అందించాలని తాను అనుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారని.. ఈ క్రమంలోనే యుక్తవయసు వచ్చిన తర్వాత మాత్రమే మద్యం తాగేందుకు ప్రజలకు లైసెన్స్ ఇవ్వాలని ఆమె సూచించారు.
అయితే గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా నాగపూర్ లోక్‌సభ స్థానం నుంచి వనితా రౌత్ పోటీ చేశారు. చిమూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా గతంలో ఆమె బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో కూడా వనితా రౌత్ ఇలాంటి హామీలే ఇవ్వడం గమనార్హం. ఇంకే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె గతంలో చేసిన ఎన్నికల హామీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం.. ఆమె సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేసింది. అయినా ఈసారి కూడా వనితా రౌత్ అలాంటి హామీలే ఇవ్వడం గమనార్హం.