అవ్వాతాతలకు పింఛను అందనివ్వకుండా చేసిన పాపం చంద్రబాబుదే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఆయన బినామీ సంస్థ ఒకటి ఈసీకి ఫిర్యాదు చేసిన ఫలితంగానే ఇవాళ వలంటీర్ల ద్వారా పింఛన్లు ఒకటో తారీఖుకే అందలేదని అన్నారు. అందుకు కారణం చంద్రబాబే. ఈ పాపం ఆయనే చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యంతో పింఛన్ల పంపిణీ అన్నది వలంటీర్లు చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. అంటే ఈ మూడ్నెల్లూ సంబంధిత లబ్ధిదారులు చుక్కలు చూడాల్సిందే. చంద్రబాబుకు అధికారం ఇస్తే ఇలానే ఇప్పటిలానే ప్రభుత్వ పథకాలను గాలికి వదిలేస్తారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. తన స్వార్థం చూసుకుని ప్రజా ప్రయోజనం అన్నది పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు.