పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడని, రాష్ట్రంలోని దళితులు, పేదలు, టిప్పర్ డ్రైవర్లే చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో పాతాళానికి తొక్కేస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారి రాజకీయాలు చేసి, రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచాలని ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, బాధ్యతాయుతంగా ఉండే రాజకీయ నాయకుడిలా చంద్రబాబు లేనే లేడన్నారు. బంధువు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థపై కుట్రలు చేశాడని మండిపడ్డారు. పెత్తందారీ పోకడలతో చంద్రబాబు నాయుడు పేదల పొట్ట కొడుతున్నాడని ధ్వజమెత్తారు.