తన తండ్రి వివేకానందరెడ్డి హత్య విషయంలో తనతోపాటు రాష్ట్ర ప్రజలందరూ జగన్ ఉచ్చులో పడ్డారని సునీతా రెడ్డి పేర్కొన్నారు. ‘‘నాన్న హత్య తర్వాత మిమ్మల్ని (జగన్‌ను) గుడ్డిగా నమ్మి మీరు చెప్పినట్లు చేశాను. నేను చేసిన తప్పును గ్రహించాను. దానిని సరిదిద్దుకొనేందుకు సమయం వచ్చింది. అందుకోసమే ఈ ప్రయత్నం’’ అని తెలిపారు. ‘‘చిన్నాన్నను ఎవరు హత్య చేశారో దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు అని జగనన్న ప్రకటనలు చేస్తున్నారు. అంటే.. ఆ ప్రాంతవాసిగా ఆయనకు కూడా తెలుసనే కదా. మరి హత్య చేసినవారి పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదు? ముఖ్యమంత్రిగానైనా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగనన్నపై ఉంది. అవినాశ్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. ఆయనను అరెస్ట్ చేస్తే ఇతర విషయాలు కూడా బయటకు వస్తాయని భయపడుతున్నారా?’’ అని సునీత ప్రశ్నించారు. తన ప్రశ్నలకు ఒక అన్నగా జగన్ తనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ... ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత కచ్చితంగా ఉందన్నారు. ‘‘జగన్ ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను లేవనెత్తిన ప్రశ్నలపై జగన్ సొంత చానల్‌కు వచ్చి చర్చించేందుకూ సిద్ధం’’ అని సునీత పేర్కొన్నారు.