ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించిందని.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారని.. అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 4.5 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొంటున్నారు. అసలే డయాబెటిస్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి మార్లేనా ట్విటర్ వేదికగా వెల్లడించారు. మార్చి 21 వ తేదీన ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని పేర్కొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారని మంత్రి అతిషి తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల కోసం, దేశం కోసం ఆయన రోజంతా పని చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయి.. ఈడీ కస్టడీకి ఆ తర్వాత తీహార్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని చెప్పారు. కేజ్రీవాల్ 4.5 కిలోల బరువు తగ్గడం చాలా బాధ కలిగించే విషయమని చెప్పిన అతిషి.. బీజేపీ కావాలని కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌కు ఏమైనా అయితే దేశమే కాదు.. భగవంతుడు కూడా వారిని క్షమించడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే జైలులో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి వార్తలు వస్తుండటంతో ఎట్టకేలకు తీహార్ జైలు అధికారులు స్పందించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏప్రిల్ 1 వ తేదీన తీహార్ జైలుకు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ బరువు తగ్గలేదని తేల్చి చెప్పారు. బీపీ కూడా నార్మల్‌గానే ఉన్నట్లు వెల్లడించారు. ఇక కేజ్రీవాల్‌ను తీహార్ జైలులోని అత్యంత భద్రత గల సెల్‌లో ఉంచినట్లు తెలిపారు. కేజ్రీవాల్ 65 కిలోల బరువు ఉన్నారని.. ఆయన బరువులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. షుగర్ లెవల్స్ కూడా సాధారణంగానే ఉన్నాయని వెల్లడించారు. ఉదయం లేవగానే కేజ్రీవాల్.. జైలులో యోగా, మెడిటేషన్ చేస్తున్నారని తెలిపారు. ఆయనకు కేటాయించిన సెల్‌లో కేజ్రీవాల్ వాకింగ్ కూడా చేస్తున్నారని చెప్పారు.