ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి కొనసాగుతోంది. పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇక నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు పార్టీలు అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన రాష్ట్రాల్లో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వచ్చి అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించే సొమ్మును మొత్తం నాణేల రూపంలో తీసుకువచ్చాడు. దీంతో ఆ నాణేలు అన్నింటినీ లెక్కపెట్టలేక ఎన్నికల అధికారులు తలలు పట్టుకున్నారు. చివరికి చాలా శ్రమించి.. ఆ లెక్కింపు పూర్తి చేసి నామినేషన్ తీసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని బుల్దానా లోక్‌సభ నియోజకవర్గం నుంచి అస్లాం షా అనే వ్యక్తి.. మహా డెమోక్రటిక్ వికాస్ అఘాడి తరఫున పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు మొత్తం నాణేలతో వెళ్లాడు. బస్తాలో తీసుకెళ్లిన ఆ నాణేలను.. నామినేషన్లు తీసుకునే అధికారుల ముందు కుమ్మరించాడు. అందులో రూపాయి, రూ.2, రూ.5 నాణేలు ఉన్నాయి. ఆ నాణేల సంచి చూసి ఎన్నికల అధికారులు షాక్ అయ్యారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు సెక్యూరిటీ డిపాజిట్ కింద ప్రతీ అభ్యర్థి ముందుగా కొంత డబ్బును చెల్లించాలి ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1/6 వ వంతు ఓట్లు ఆ అభ్యర్థికి వస్తే.. ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఆ అభ్యర్థికి వెనక్కి ఇచ్చేస్తారు. లేని పక్షంలో అది ఎన్నికల సంఘానికి చేరతాయి. అయితే రూ.25 వేల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించేందుకు అస్లాం షా.. రూ.10 వేల విలువైన నాణేల మూటను తీసుకురావడం తీవ్ర వైరల్‌గా మారింది. మరో రూ.15 వేలను నోట్ల రూపంలో చెల్లించాడు. అయితే ఆ చిల్లరను లెక్కించేందుకు అధికారులు ఆపసోపాలు పడ్డారు. దాదాపు 40 నిమిషాలు పాటు ఆ చిల్లరను లెక్కించిన అధికారులు చివరికి నామినేషన్ తీసుకున్నారు. మహారాష్ట్రలో మొత్తం ఐదు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19 వ తేదీన జరగనుంది. తాను బుల్దానా స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానని.. అయితే తన వద్ద డబ్బులేదని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించేందుకు ప్రజల నుంచి చందాలుగా డబ్బులు తీసుకున్నట్లు తెలిపాడు. ఆ డబ్బులనే ఎన్నికల అధికారులకు అందజేసినట్లు వెల్లడించాడు. తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని.. ముంబై, నాగ్‌పూర్, బుల్దానాలో జరిగిన పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేవాడినని చెప్పాడు.