అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తామని చెప్పిన వాళ్లే పొత్తులో భాగంగా సీట్లు దక్కకపోవడంతో నిరసన స్వరం వినిపిస్తున్నారు. మొన్నటికి మొన్న జనసేన పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పితాని బాలకృష్ణ రాజీనామా చేయగా.. నేను కోనసీమలో కీలకమైన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేస్తూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
లంచగొండులకు జనసేన టిక్కెట్లు అమ్ముకుని అమలాపురంలో జనసేన జెండా పీకేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు శెట్టిబత్తుల రాజాబాబు. బుధవారం నాటు జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు రాజాబాబు. అమలాపురం అంటే జనసేన కంచుకోట అని.. అలాంటి కీలకమైన నియోజక వర్గాన్ని టీడీపీకి పొత్తుపేరుతో ధారాదత్తం చేశారని ఆరోపించారు రాజాబాబు. జనసేన జెండానే ఊపిరిగా.. పార్టీయే ప్రాణంగా బతికిన జనసైనికులకు అధినేత పవన్ కళ్యాణ్ తీరని అన్యాయం చేస్తున్నారని.. లంచగొండులకు జనసేన టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు రాజాబాబు.
ఇక మీడియాతో మాట్లాడిన రాజాబాబు పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ జనసేన పార్టీని వీడేదే లేదని చెప్పాను. కానీ.. ఇప్పుడు అసలు జనసేన జెండానే లేకుండా పోయింది. అమలాపురం నియోజకవర్గం అంటే దానికి చారిత్రక నేపథ్యం ఉంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే నియోజక వర్గం అమలాపురం. మెగా ఫ్యామిలీకి కూడా ఈ నియోజక వర్గంతో మంచి అనుబంధం ఉంది. అలాంటి నియోజక వర్గంలో జనసేన పార్టీ జెండా పీకేశారు పవన్ కళ్యాణ్.
నేను మిథున్ రెడ్డిగారిని కలిసినట్టు తప్పుడు ప్రచారం చేశారు టీడీపీ వాళ్లు. దానిపై విచారణ చేయాల్సిందిగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌గారికి తెలియజేశాను. కానీ ఆయన సంజాయిషీ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ రాత్రే.. అయితాబత్తుల ఆనందరావుని ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటించేశారు. నాపై అభియోగాలు వచ్చింది మార్చి 18న.. కానీ మార్చి 15నే అయితాబత్తుల ఆనందరావుకి.. పి.గన్నవరం టికెట్‌లు కన్ఫామ్ అయిపోయాయి. కానీ 15 జరిగిన సంఘటనని 18 జరిగిన ఇష్యూతో ముడిపెట్టి.. నా భుజంపై తుపాకీ పెట్టి కాల్చి నన్ను దోషిగా చూపించాలని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించారు.
నిజంగా నాపై నమ్మకం లేకపోతే.. జనసేన పార్టీ తరుపున వేరే అభ్యర్దిని పెట్టాలి కదా.. అమలాపురం అంటే జనసేనకి గుండెకాయ అని చెప్పింది మీరే కదా.. ఆ గుండెకాయని టీడీపీకి ఎలా ఇచ్చేస్తారు. గుండెకాయ లేకపోతే ప్రాణం ఉంటుందా? జనసేన పార్టీ పరిస్థితి కూడా అంతే. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ల ఒత్తిడి వల్లే జరిగింది. రిటైర్డ్ అయిన వాళ్లకి కొంత డబ్బు వస్తుంది. దానికి తోడు అవినీతి చేసి సంపాదిస్తారు. అలా అవినీతి చేసిన అధికారులకు ఈరోజు పవన్ కళ్యాణ్ టికెట్లు ఇచ్చారు. రాజోలు అభ్యర్థికానీ.. పి. గన్నవరం అభ్యర్ధికానీ.. ఇలాంటి వాళ్లే. వాళ్లు ఖచ్చితంగా అవినీతి పరులే. లేకపోతే.. ఓ సామాన్య ఉద్యోగి రాజకీయ పార్టీల తరుపున పోటీ చేసే స్థాయికి ఎలా ఎదిగాడు. ఎదిగాడంటే.. ఖచ్చితంగా లంచగొండులే. వాళ్లకి జనసేన పార్టీ టికెట్‌లను అమ్ముకుని తనకి అన్యాయం చేశారని పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు శెట్టిబత్తుల రాజాబాబు.