2024 ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ దూకుడు పెంచారు. వైనాట్ 175 అంటూ ప్రచారబరిలో దూసుకెళ్తున్నారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని జగన్ నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వైనాట్ 175 అనే నినాదమిచ్చిన జగన్.. అదే నినాదంతో ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేపట్టిన జగన్.. బుధవారం చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన సభలో పాల్గొన్న జగన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డా అయిన కుప్పంలో ఆయనను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలో జగన్ ఉన్నారు. అందులో భాగంగానే కుప్పం వైసీపీ అభ్యర్థిగా యువకుడైన భరత్‌ను బరిలో నిలిపారు. ఇప్పటికే భరత్‌ను ఎమ్మెల్సీ చేసి.. కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు జగన్. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చంద్రబాబును ఓడించాలని జగన్ భావిస్తున్నారు. అలాగే పూతలపట్టులో జరిగిన సభలో భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే.. మంత్రిని చేస్తానని.. దాని ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు వీలు కలుగుతుందని ప్రకటించారు.
వచ్చే ఎన్నికల కోసం మార్చి 27 ఎన్నికల ప్రచారం చేపట్టిన జగన్.. ఇప్పటి వరకూ జరిగిన సభలలో ఎవరినీ మంత్రిని చేస్తానని బహిరంగంగా ప్రకటించలేదు. భరత్ విషయంలో ఇప్పటికే పలుసార్లు మంత్రిని చేస్తానని ప్రకటించిన జగన్.. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత ఇలా స్టేట్ మెంట్ ఇవ్వడం ఇదే తొలిసారి. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. అలాగే కుప్పంలో భరత్ విజయం సాధిస్తే తొలి క్యాబినెట్ బెర్తు ఆయనదే అవుతుంది.
మరోవైపు పూతలపట్టు సభలో చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో నిజానికి, అబద్ధానికి.. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందన్న వైఎస్ జగన్.. ఎటువైపు ఉండాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. ఏ ప్రభుత్వంలో ఎక్కువ లబ్ధి పొందామో ఆలోచించి ఓటేయాలని కోరారు. వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పింఛన్ అందిస్తుంటే తన మనుషుల ద్వారా చంద్రబాబు అడ్డుకున్నారన్న జగన్.. అలాంటి వ్యక్తి కావాలో, నేరుగా ఇంటికే సంక్షేమాన్ని అందించే వైసీపీ కావాలో తేల్చుకోవాలని అన్నారు.