ఏపీలో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా పెన్షన్ల పంపిణీ అంశమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. పెన్షన్లపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పెన్షన్ల కోసం ఎదురు చూసిన పెన్షన్ దారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ షురూ అయినప్పటికీ మొదటి రోజు ఎంతటి హంగామా జరిగిందో అందరికీ తెలిసిందే. పెన్షన్ల కోసం ఉదయం నుంచి వృద్ధులు, వితంతువులు సచివాలయాల వద్ద క్యూలైన్లలో పడిగాపులు పడాల్సి వచ్చింది. అయితే డబ్బులు అందలేదని, ఉదయం నుంచి కాదు మధ్యాహ్నం నుంచి పెన్షన్ పంపిణీ అంటూ ఇలా పలు రకాల ప్రకటనలతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడ్డారు. చివరకు నిన్నటి సాయంత్రం నుంచి పెన్షన్ల పంపిణీ మొదలవడంతో పెన్షన్‌దారులు ఊపిరిపీల్చుకున్నారు.