సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జాప్యం కేవలం వైసీపీ నిర్లక్ష్యమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి విమర్శించారు. పీలేరు పట్టణంలోని కోటపల్లె, మండలంలోని వేపులబైలు పంచాయతీలో బుధవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచించిన విధంగా పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గ్రామ సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టంగా నిర్దేశించినా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందన్నారు. తమకు కావాల్సిన వారికి కోట్లాది రూపాయల మేరకు బిల్లులు చెల్లించుకున్న ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన పింఛన్ల సొమ్మును మాత్రం సర్దుబాటు చేయలేకపోయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నాయకులు టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. వలంటీర్ల తొలగింపు పాపం పూర్తిగా వైసీపీదేనన్నారు. పింఛన్ల పంపిణీకి తమ పార్టీ పూర్తిగా అనుకూలమని, రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్లను ప్రారంభించింది టీడీపీయేనన్నారు.