రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని సంతనూతలపాడు టీడీపీ కూటమి అభ్యర్థి బీఎన్.విజయ్‌కుమార్ అన్నారు. జగన్ నిరంకుశ పాలనపై పేద, మధ్యతరగతి ప్రజల్లో తీవ్రవ్యతిరేకత నెలకొన్నదన్నారు. సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మాదాల నరసయ్య, మాదాల రవితోపాటు అనుచరులు బుధవారం బీఎన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ బీఎన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాదాల నరసయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నదని, వైసీపీ మాత్రం మాటలతో మాయ చేస్తున్నదన్నారు. బీఎన్ గెలుపు ఖాయమని, బాబు పాలనలో మళ్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర కులాలకు సమన్యాయంగా పథకాలు అందుతాయని తెలిపారు. మాదాల రవి మాట్లాడుతూ ఇటు రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ వైసీపీ నాయకుల నియంతృత్వ పోకడలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. చంద్రబాబు సీఎం కావడమే దీనికి సమాధానమన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, తన్నీరు శ్రీను, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.