జనసేన పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ఒక అభ్యర్థిని మార్చారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ను ప్రకటించారు. రైల్వే కోడూరు స్థానానికి తొలుత యనమల భాస్కర్ రావును అభ్యర్థిగా ప్రకటించగా తాజాగా ఆయన స్థానంలో అరవ శ్రీధర్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తూ జనసేన పార్టీ గురువారం (ఏప్రిల్ 4) సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది. అరవ శ్రీధర్ మూడు రోజుల కిందటే జనసేన పార్టీలో చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో అభ్యర్థి మార్పునకు సంబంధించి జనసేన వివరణ ఇచ్చింది.
‘రైల్వేకోడూరు అభ్యర్థిగా తొలుత యనమల భాస్కర్ రావును ప్రకటించగా.. క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు పరిశీలించారు. ఈ స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. రైల్వేకోడూరుకు చెందిన జనసేన, టీడీపీ నాయకులు కొంత మంది.. పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిసి అక్కడి పరిస్థితిని వివరించారు. అనంతరం రైల్వేకోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు’ అని జనసేన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.