ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం అనేది సహజం, అనివార్యం. చాలా మంది ఇలాగే భావిస్తారు. కొన్ని సాధారణ అలవాట్లతో వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా చేసి సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం సాధ్యమని కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి. అయితే, జీవితంలో వృద్ధాప్యాన్ని మీరు ఎలా చూస్తారో.. అదే మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అవును ఇదే విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి తేటతెల్లం చేసింది. తమ తోటివారి కంటే తక్కువ వయస్సులో ఉన్నామని నమ్మే వ్యక్తులు మెరుగైన ఆరోగ్యంతో ఉన్నారని ఓక్లహోమా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనంలో వెల్లడయ్యింది. యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జూలీ ఒబెర్ అలెన్ నేతృత్వంలో చేపట్టిన ఈ అధ్యయనంలో 50 నుంచి 80 ఏళ్ల వయసున్న 2,000 మంది పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా వారి వయసు ఇతరులతో పోల్చడం, తమ రూపం, వయసు సంబంధిత అనుకూల లేదా ప్రతికూల అనుభవాల గురించి ప్రశ్నించారు.
అధ్యయనంలో పాల్గొన్న చాలా మంది తామ తోటివారి కంటే చిన్నవయసులో ఉన్నట్లు విశ్వసించడం ఆశ్చర్యకరం. పురుషుల కంటే మహిళలు ఈ నమ్మకాన్ని ఎక్కువగా కలిగి ఉన్నారని, వారు యవ్వనంగా కనిపించడానికి ఇదే కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఆడవాళ్లు తమ వయసు ఇతరుల కంటే తక్కువనే భావనలో ఉంటారు. అయితే, యవ్వనంగా కనిపించడంపై మాత్రమే దృష్టి పెట్టడం ఆరోగ్యకరమైన విధానం కాకపోవచ్చు. ఎందుకంటే, వయసు సంబంధిత వివక్షను ఎదుర్కొంటున్నట్లు చెప్పిన కొందరు.. యవ్వనంగా కనిపించడానికి ప్రయత్నించినప్పటికీ వారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది.
వృద్ధాప్యం విషయంలో సామాజిక అంశం ప్రతికూల ప్రభావాన్ని ఇది హైలైట్ చేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. వ్యాయామం, మంచి ఆహారం వంటి ఆరోగ్యకరమైన విధానాలపై దృష్టి పెట్టాలని, ఇది కాలక్రమేణా ఆరోగ్యం, పనితీరు రెండింటినీ మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డారు. ‘వయసు అనేది వివక్షకు మరో రూపం.. ఇది తరచుగా వ్యక్తమవుతుంది... వృద్ధులకు తమ వయసుకు తగినట్లుగా ఉండాలని చెప్పడం లేదా వారు సాంకేతికతను వినియోగించలేరని ఇతరులు భావించడం వల్ల ఒత్తిడికి గురవుతారు... కొన్నిసార్లు దీనిని అధిగమించడానికి ధూమపానం వంటి ప్రతికూల ఆరోగ్య అలవాట్లవైపు మొగ్గుచూపుతారు’ అని అలెన్ వ్యాఖ్యానించారు.
‘యవ్వనంగా కనిపించడానికి ఎంత సమయం, శక్తిని వెచ్చిస్తారని అధ్యయనంలో పాల్గొన్నవారి అడిగాం.. ఇది ఒక గమ్మత్తైన ప్రశ్న, ఎందుకంటే ఇది ఆ మూస పద్ధతుల్లో కొన్నింటిని క్రియాశీలకం చేస్తుంది.. 35 శాతం మంది సమయం, డబ్బును పెట్టుబడి పెట్టినట్లు మాకు చెప్పారు.. ఆసక్తికరంగా వీరు సమాజంలో తమకు ఎదురైన వృద్ధాప్యం సానుకూల, ప్రతికూల అనుభవాలను పంచుకున్నారు.. బహుశా యవ్వనంగా కనిపించడానికి ప్రయత్నించి విజయం సాధించిన వారు తక్కువ వివక్షను ఎదుర్కొన్నారు.. అయితే, అదే వ్యక్తులు వృద్ధాప్యంతో మరింత అసౌకర్యానికి గురై ఉంటారు’ అని ఆమె పేర్కొన్నారు. వృద్ధాప్యం విషయానికి వస్తే సానుకూల స్వీయ-అవగాహన ప్రాముఖ్యతను అధ్యయనం నొక్కి చెబుతుంది. వృద్ధాప్యాన్ని సానుకూల కోణంలో చూడటం ద్వారా తమ శ్రేయస్సుకు దోహదపడే ఆరోగ్యకరమైన అలవాట్లను స్వీకరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.