టోల్‌ప్లాజాపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటంతో వారి నుంచి తప్పించుకోడానికి పరుగెత్తుతూ ఇద్దరు ఉద్యోగులు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. టోల్ ఫీజు విషయంలో సిబ్బందితో ఘర్షణ పడిన ఓ దుండుగుడు తుపాకితో కాల్పులకు ప్రయత్నించాడు. దీంతో తమను తాము రక్షించుకే ప్రయత్నంలో టోల్‌ప్లాజా సిబ్బంది బావిలో పడిపోయారు. దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దగరాయ్ వద్ద ఝాన్సీ-గ్వాలియర్ జాతీయరహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డయ్యాయి. మృతులను ఆగ్రాకు చెందిన శ్రీనివాస్ పరిహార్, నాగ్‌పూర్‌కి చెందిన శివాజీ కండేలాగా గుర్తించారు. మర్నాడు ఉదయం మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు.
జాతీయ రహదారి 44పై దగరాయ్ టోల్ ప్లాజావద్ద మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మాస్క్‌లు ధరించిన వ్యక్తులు నాలుగు ద్విచక్రవాహనాలపై వచ్చి.. దాడి చేశారు. అక్కడ టోల్‌బూత్‌ల డోర్లును తోసుకుంటూ లోపలికి వెళ్లారు. కంప్యూటర్లను ధ్వంసం చేసి, సిబ్బందిపై కూడా భౌతిక దాడికి దిగారు. వారిని బయటకు లాగి ఇష్టమొచ్చినట్టు కొట్టారు. దుండగులు గాల్లోకి కాల్పులు జరపడంతో సిబ్బంది ప్రాణాలను కాపాడుకునేందుకు పక్కనే ఉన్న పొలంలోకి పరుగులు తీశారు. పరిగెత్తుతుండగా శ్రీనివాస్, శివాజీలు కార్యాలయం వెనుక ఉన్న దిగుడు బావిలో పడి మునిగిపోయారు.
ఈ దాడి వెనుక గతంలో ఈ టోల్‌బూత్ నిర్వహించిన మాజీ కాంట్రాక్టర్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఝాన్సీ-గ్వాలియర్ మధ్య ఉన్న దగరాయ్ టోల్ ప్లాజా కాంట్రాక్ట్‌ను ఏప్రిల్ 1న కొత్త వ్యక్తి దక్కించుకున్నాడు. అయితే, మాజీ కాంట్రాక్టర్ తన వాహనాలకు టోల్‌ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించగా.. కొత్త కాంట్రాక్టర్ అందుకు అభ్యంతరం తెలిపాడు. దీనిపై వివాదం చెలరేగడంతో కొత్త కాంట్రాక్టర్‌ను భయపెట్టేందుకు మంగళవారం రాత్రి తన మనుషులతో దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా నివేదించింది. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదుచేశామని ఓ పోలీస్ అధికారి తెలిపారు.