ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయులకు శుభవార్త చెప్పిన జపాన్.. అమల్లోకి ఈ-వీసా ప్రోగ్రామ్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 10:34 PM

భారతీయుల సహా వివిధ దేశాల పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్ ‘ఈ-వీసా’ను ప్రారంభించింది. పాస్‌పోర్టులలో భౌతిక స్టిక్కర్ల అవసరం లేకుండా ఈ కొత్త విధానాన్ని జపాన్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 1, 2024 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా భారతీయ పర్యాటకులు ఆన్‌లైన్‌లోనే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా నిర్వహిస్తున్న జపాన్ వీసా అప్లికేషన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. పర్యాటకుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ విధానంలో వీసా పొందినవారు జపాన్‌లో గరిష్ఠంగా 90 రోజులు ఉండటానికి అనుమతిస్తుంది. అయితే జపాన్‌లో ఎంట్రీకి మాత్రం ఒకే ఒక్కసారి అనుమతి ఉంటుంది.


భారతీయులతో పాటు ఇండియాలో నివసిస్తున్న విదేశీయులు కూడా ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కాంబోడియా, కెనడా, సౌదీ అరేబియా, సింగ్‌పూర్, దక్షిణాఫ్రికా, తైవాన్, యూఏఈ, యూకే, అమెరికాకు చెందిన పర్యాటకులకు కూడా ఎలక్ట్రానిక్ వీసాకు అర్హులే. ఈ దేశాలు లేదా ప్రాంతాల నివాసితులు, స్వల్పకాలిక వీసాల నుంచి మినహాయింపు పొందినవారు జపాన్ ఈ-వీసా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు విధానం


జపాన్ వీసా అధికారిక వెబ్‌సైట్ https://visa.vfsglobal.com/ind/en/jpn/‌లోకి వెళ్లాలి.


దరఖాస్తు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను పొందుపరచాలి. ఫొటోలతో సహా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.


దరఖాస్తును సమర్పించడానికి తేదీని ముందుగా బుక్ చేసుకుంటే ఫీజు వివరాలు సహా అపాయింట్‌మెంట్ లెటర్‌తో కూడిన ఈ-మెయిల్‌ వస్తుంది.


దరఖాస్తును అందజేసి.. నిర్ణయం కోసం వేచిచూడాల్సి ఉంటుంది. వీసా అప్లికేషన్‌ స్టేటస్‌ని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చు.


విజయవంతంగా ఎంపికైన దరఖాస్తుదారులకు ఎలక్ట్రానిక్ వీసా మంజూరు అవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, భౌతిక వీసా స్టిక్కర్‌లను జారీ చేయడం జరగదు.


ప్రయాణ సమయంలో ఎయిర్‌పోర్టుల వద్ద చెక్-ఇన్ సమయంలో తమ డివైజ్‌లలోని వీసా చూపించాల్సి ఉంటుంది. ఈ-వీసాపై ఉన్న డిస్‌ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com