వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం చేయాలంటూ ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో వైఎస్ సునీతా రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 2009 వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను కుట్రలో భాగంగా పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీలతో సబంధం లేదని సునీత స్పష్టం చేశారు. తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలు, బ్యూరో క్రాట్స్‌ని కలిశానని, కలుస్తానని స్పష్టం చేశారు. ఎవరి పని వాళ్ళు చేస్తే తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. తనకు ఫేవర్ చేయాలని కూడా తాను కోరుకోవడం లేదన్నారు. వివేక కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని అంతా తానై షర్మిల చూసుకుందన్నారు సునీత. 3,000 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ కోసమే షర్మిల చేసిందని గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసిన కుటుంబ సభ్యులు షర్మిల, వివేకాకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు. జగన్ జైల్‌లో ఉన్న సమయంలో 2012 బై ఎలక్షన్లలో షర్మిల పోరాటంతోనే వైసీపీకి సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. షర్మిల చరిష్మా చూసి అక్కసుతో ఆమెను దూరం పెట్టారని ఆరోపించారు. 2019 ఎలక్షన్‌లో షర్మిలకు కడప లేదా వైజాగ్ నుండి సీటు ఇస్తారని భావించారన్నారు. కానీ, షర్మిలకు ఎలాంటి సీటును జగన్ కేటాయించలేదన్నారు.