ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్, ఆయన సబార్డినేట్ వైవీవీజే రాజశేఖర్‌లపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా న్యాయస్థానం ఆదేశాలమేరకు ఈ కేసు నమోదయ్యింది. తాము నిర్వహిస్తోన్న పాఠశాలకు అధికారులను పంపి.. పలు కీలక డాక్యుమెంట్లు, పత్రాలను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ప్లెజెంట్ వ్యాలీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ మార్చి 2న అల్మోరా కోర్టులో పిటిషన్ వేసింది. ఫిబ్రవరి 14న దడకడ గ్రామంలోని పాఠశాలకు నలుగురు అధికారులను పంపారని పిటషన్‌లో పేర్కొంది. జాయింట్ సెక్రటరీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆధారులున్న ఫైల్స్, రికార్డులు, డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్‌లను ఎత్తుకెళ్లారని సదరు ఎన్జీఓ ఆరోపించింది.
ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన అల్మోరా కోర్టు.. ఢిల్లీ సీఎస్, సబార్డినేట్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని రెవెన్యూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గోవింద్‌పూర్ రెవెన్యూ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అల్మోరా జిల్లా మేజిస్ట్రేట్ వినీత్ తోమర్ వెల్లడించారు. విజిలెన్స్ సహా ఇతర ఫోరమ్‌లలో తమకు వ్యతిరేకంగా చేసిన అవినీతి ఫిర్యాదులను వెంటనే ఉపసంహరించుకోవాలని బెదిరించినట్టు ప్లెజెంట్ వ్యాలీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. నలుగురు అధికారులు తమ వెంట తెచ్చుకున్న టైప్ రైట్ పత్రాలపై సంతకం చేయాలని బలవంతం చేశారని ఆరోపించారు.
ఎన్జీవో సభ్యులు ప్రతిఘటించడంతో.. ఆఫీసులో సొరుగులో ఉన్న రూ.63 వేల నగదు ఎత్తుకెళ్లారని తెలిపారు. దీంతో అధికారులపై దోపిడీ, నేరపూరిత చొరబాటు, నేరపూరిత కుట్ర, శాంతిభద్రతలకు భంగం కలిగించడం, క్రిమినల్ బెదిరింపులు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
![]() |
![]() |