ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్ ఏపీ ప్రజలను మోసం చేశారని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరంలో ఆమె ఇవాళ పర్యటించారు. మొదట రోడ్‌షో నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి మద్యం వ్యాపారంలో బాగా సంపాదించారని విమర్శించారు. నాసిరకం మద్యం విక్రయించడం ద్వారా పేద ప్రజల జీవితాలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం ఒక చేత్తో మట్టిం చెంబు ఇష్తూ.. మరో చేత్తో వెండి చెంబు లాగేసుకుంటుందని విమర్శించారు. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే.. జగన్ మోదీకి తొత్తుగా మారారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మెసం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్.. ఐదేళ్ల కాలంలో ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని షర్మిల ఆరోపించారు. మెగా డీఎస్సీ ఇస్తామని నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతు రాజుగా ఉంటే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అన్నదాతను బికారిగా మార్చిందన్నారు. జగన్ పాలనలో రైతు ఆత్మహత్యలు అధికమయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయిల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.