ఏపీ సీఎం జగన్ గులకరాయి డ్రామా ఆడుతున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ అంటూ టీడీపీ నేతలు, వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే జగన్‌కు ఇలాంటి డ్రామాలు అలవాటుగా మారాయని దుయ్యబడుతున్నాయి. నేడు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికలకు జగన్ డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు. బాబాయిని హత్య చేసిన వారిని మాత్రం జగన్ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో కరెంట్ తీయడం కుట్ర కాదా? అని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. జగన్ కపట నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయని అన్నారు. డీజీపీని, పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. జగన్ పెద్ద మొత్తంలో డబ్బు పంపిణీ చేసినా కూడా ఆయనకు ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. అసలు జగన్‌కు ఓట్లు ఎందుకు వేయాలని గోరంట్ల ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై జగన్ ఎప్పుడు స్పందించలేదన్నారు. జగన్ డ్రామాకు సానుభూతి రాదని గోరంట్ల స్పష్టం చేశారు. కాగా.. జగన్‌పై రాయి విసిరిన కేసులో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఒక రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను ఇచ్చిన సమాచారంతో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.