లోక్‌సభ ఎన్నికల వేళ.. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సమయంలో నేతలు చేసే చిన్న చిన్న పనులు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారతాయి. ఇటీవల ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు.. తేజస్వీ యాదవ్.. చేపలు తింటున్న ఫోటో వైరల్ కావడం రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. అయితే తేజస్వీ యాదవ్ నవరాత్రుల సందర్భంగా చేపలు తింటూ ఆ ఫోటో పోస్ట్ చేయడం తీవ్ర విమర్శలకు కారణం అయింది. దీంతో బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా.. ఆర్జేడీ నేతలు కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంలో జోక్యం చేసుకున్న తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సోమవారం పాల్గొన్న మమత బెనర్జీ.. నవరాత్రుల్లో తేజస్వీ యాదవ్ చేపలు తినడంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో బీజేపీని అధికారంలో నుంచి గద్దె దించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఏం తినాలి.. ఎలా పడుకోవాలి.. ఏం తాగాలి అనే వాటిని అన్నీ బీజేపీ నేతలే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. ఇక బీజేపీ నేతలు ప్రజలపై వారి విధానాలను రుద్దుతున్నారని దీదీ ఫైర్ అయ్యారు.
ఇక బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తే మరింత దారుణంగా ప్రవర్తిస్తారని మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మనం రోజూ ఉదయం చాయ్ తాగడానికి బదులుగా బీజేపీ నేతలు గో మూత్రం తాగమని అంటారని.. భోజనానికి బదులు ఆవు పేడ తినమని అంటారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఒకవేళ బీజేపీకి మళ్లీ అధికారం ఇస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవని దీదీ తెలిపారు. వాళ్లకు వన్ లీడర్, వన్ నేషన్, వన్ భోజన్, వన్ భాషన్ కావాలి’ అని మమత తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19 వ తేదీన జరగనుంది.