చుట్టూ పనివాళ్లు.. అత్యంత ఖరీదైన భవంతులు.. ఇవన్నీ వదిలి సన్యాసం స్వీకరించాలని ఓ సంపన్న దంపతులు భావించారు. గుజరాత్‌కు చెందిన సంపన్న జైన దంపతులు దాదాపు రూ. 200 కోట్ల తమ ఆస్తిని త్యజించి, సన్యాసం స్వీకరించారు. మోక్షం కోసం దేశ యాత్రకు బయలుదేరాలని వారు నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఒక వేడుకలో వ్యాపారవేత్త భావేశ్ భాయ్ భండారి, ఆయన భార్య తమ సంపద మొత్తాన్ని దానం చేశారు. మెటీరియలిజం’ ఉచ్చులో చిక్కుకోకుండా ఆధ్యాత్మిక అన్వేషణ వైపు అడుగేయాలని నిర్ణయించుకున్నట్టు వారు తెలిపారు. ఈ నెలాఖరులో జరిగే కార్యక్రమంలో అధికారికంగా సన్యాసం జీవితంలోకి ప్రవేశిస్తారు. గుజరాత్‌లో ప్రముఖ సంపన్న కుటుంబాల్లో ఒకటి భావేశ్ కుటుంబం.
పిల్లల మార్గంలో తల్లిదండ్రులు
నిర్మాణ రంగంలో ఉన్న హిమ్మత్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త భావేశ్ భండారీ.. 2022లో సన్యాసం స్వీకరించిన తన 19 ఏళ్ల కుమార్తె, 16 ఏళ్ల కుమారుడి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. భావేష్, ఆయన సతీమణి తమ పిల్లల నుంచి ప్రేరణ పొందడం చెప్పుకోదగ్గ అంశం. ‘భౌతిక అనుబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరాలని’ నిర్ణయించుకున్నారని వారి బంధువులు తెలిపారు.
ఏప్రిల్ 22న దీక్ష స్వీకరించిన తర్వాత, దంపతులు కుటుంబ బంధాలను తెంచుకోనున్నారు. ప్రాపంచిక సుఖాలను వదులుకుని, పాదరక్షలు లేకుండా దేశాటనకు బయలుదేరుతారు. కేవలం రెండు జతల తెల్లటి దుస్తులు, భిక్ష కోసం ఒక పాత్ర, తెల్లటి చీపురు (రజోహరన్ జైన సన్యాసులు కూర్చునే ముందు చుట్టూ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు... ఇది వారు అనుసరించే అహింస మార్గానికి చిహ్నం) మాత్రమే వారి వద్ద ఉంటాయి.
అపర కుబేరులుగా గుర్తింపు పొందిన భండారీ కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, దేశంలో సూక్ష్య నీటిపారుదల వ్యవస్థకు మార్గదర్శకుడు భావరాలాల్ జైన్ వంటి కొందరు సంపన్నులు గతంలో సన్యాసం స్వీకరించారు. భండారీ దంపతులు మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించి, తమ మొబైల్ ఫోన్‌లు సహా తమ ఆస్తులన్నింటినీ దానం చేశారు. చివరిసారిగా ఖరీదైన వస్త్రాలు, ఆభరణాలు ధరించి రథంపై ఊరేగింపుగా వెళ్లారు.
జైనమతంలో ముఖ్యమైన నిబద్ధత ‘దీక్ష’
ఇక, జైనమతంలో 'దీక్ష' తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైన నిబద్ధత. వ్యక్తి భౌతిక సుఖాలను వదిలి భిక్షతో జీవిస్తూ, దేశవ్యాప్తంగా చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు. గతేడాది గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, ఆయన భార్య సన్యాసం తీసుకున్నారు. దీనికి ఐదేళ్ల ముందే వారి పన్నెండేళ్ల కుమారుడు సన్యాసిగా మారడం విశేషం. కుమారుడి దీక్షా వేడుక కోసం ఫెరారీని నడిపిన దంపతులు.. తమ దీక్ష కోసం జాగ్వార్ కారును చివరిగా నడిపారు.
ఇక, 2017లో మధ్యప్రదేశ్‌కు చెందిన సంపన్న జంట రూ.100 కోట్లను దానం చేసి.. తమ మూడేళ్ల కుమార్తెను వదిలి సన్యాసం స్వీకరించ వార్తల్లో నిలిచారు. సుమిత్ రాథోడ్ (35), ఆయన భార్య అనామిక (34) తమ కుమార్తెను తాతనాయినమ్మల వద్ద వదిలిపెట్టారు. సుమిత్ సన్యాసిగా మారడానికి ముందు గుజరాత్ బాలల సంరక్షణ కమిషన్.. వారి కుమార్తె ఇభ్య భవిష్యత్తు కోసం దంపతులు తీసుకున్న చర్యల గురించి అధికార యంత్రాంగం నుంచి నివేదికను కోరింది.