ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేనిఫెస్టోలో సీఏఏ అమలు.. ఎన్ఆర్సీపై బీజేపీ మౌనం!

national |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:32 PM

బీజేపీ ఆదివారం ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో.. అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యమిస్తూ.. ప్రజాకర్షక, వివాదాస్పద అంశాలకు దాదాపు దూరంగా ఉంది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌‌, మోదీ కీ గ్యారంటీ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో 10 సామాజిక సమూహాలు, 14 ప్రధాన అంశాలను పొందుపరిచింది. దేశంలో 80 కోట్ల మందికిపైగా పేదలకు ఉచిత రేషన్‌ను మరో ఐదేళ్లు కొనసాగిస్తామని తెలిపింది. అలాగే, 70 ఏళ్లు పైబడిన వృద్ధులందర్నీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కిందికి తీసుకొచ్చి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది.


ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం కింద భౌగోళిక ప్రాంతాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చినప్పటికీ. 2019 సార్వత్రిక ఎన్నికల మేనిఫేస్టోలో అసోంలో ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఈసారి మాత్రం ఎన్ఆర్సీ అంశాన్ని మాత్రం బీజేపీ పక్కనబెట్టింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రమే అమలు చేస్తామని పేర్కొంది. ఇక, సీఏఏను ఆమోదించబడినప్పుడు ప్రతిపక్షాలు దానిని ఎన్ఆర్సీ అమలుకు జరుగుతోన్న ప్రయత్నమని ఆరోపించాయి. ఇది భారతీయ ముస్లింలను దేశ పౌరులుగా అనుమతించదని అన్నాయి. అయితే, సీఏఏ, ఎన్ఆర్సీ మధ్య ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం పదేపదే స్పష్టం చేసింది. కానీ, దీనిపై ముస్లిం వర్గాల్లో ఆందోళనలు, సందేహాలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్సీని బీజేపీ ప్రస్తావించలేదు.


ప్రస్తుతానికి సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం అసోంలోని ఎనిమిది జిల్లాలకు మాత్రమే పరిమితం చేశారు. మణిపూర్‌లో ఏడు జిల్లాల్లోని 19 పోలీస్ స్టేషన్‌లు, నాగాలాండ్‌లో 8 జిల్లాల్లోని 18 పోలీస్ స్టేషన్‌లు దాని పరిధిలో లేవు. ఏఎఫ్ ఎస్ పీఏ  మే 2015లో త్రిపుర, మార్చి 2018లో మేఘాలయ నుంచి పూర్తిగా ఉపసంహరించారు. అయితే, కశ్మీర్‌కు చెందిన ఒక టీవీ ఛానెల్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోం మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెరుగైన భద్రతా పరిస్థితుల దృష్ట్యా, జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఏఎఫ్ ఎస్ పీఏఉపసంహరించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు.


తాజాగా బీజేపీ మేనిఫెస్టోలో చేర్చిన ఇతర భద్రతా సంబంధిత హామీల్లో కొత్త క్రిమినల్ చట్టాలను త్వరితగతిన అమలు చేయడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలను నిర్మూలించడం, ఇంటర్నెట్‌తో భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే డిజిటల్ సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడం వంటివి ఉన్నాయి. దేశంలోని ఏ నగరంలోనూ 2014 నుంచి ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదని, జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత హింస గణనీయంగా తగ్గిందని సంకల్ప్ పత్రలో తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు ద్వారానే మహిళలకు సమాన హక్కులు లభిస్తాయని, ఉత్తమ సంప్రదాయాలను రూపొందించి, ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని అమలుచేస్తామని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com