లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు ముందు తమిళనాడులో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. రూ.700 కోట్ల విలువైన 1,425 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీపెరంబదూర్ నియోజకవర్గంలోని మింజూర్-వండలూరు ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం తనిఖీలు నిర్వహిస్తుండగా.. మినీ ట్రక్కులో బంగారం గుర్తించారు. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తుండటంతో సీజ్ చేశారు. అనంతరం ఆదాయపు పన్ను అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చారు. కాంచీపురం జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు శ్రీపెరంబుదూర్ నియోజకవర్గంలో ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
వండలూరు-మింజూర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కుండ్రత్తూరు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న బృందం ఒకటి మింజూరు నుంచి శ్రీపెరంబుదూరు వైపు వేగంగా వస్తున్న కారు, మినీ లారీని ఆపింది. మినీ లారీని తనిఖీ చేయగా 1,425 కిలోల బంగారు కడ్డీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారు కడ్డీలను శ్రీపెరంబుదూర్ సమీపంలోని ఫ్యాక్టరీ గోడౌన్‌కు తరలిస్తున్నట్లు కారులో ఉన్నవారు తెలిపారు. కస్టమ్స్ క్లియరెన్స్ సహా అవసరమైన పత్రాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. కానీ, ఆ పత్రాలను అధికారులు పరిశీలించగా.. పూర్తి వివరాలు లేవని తేలింది.
400 కిలోల బంగారు కడ్డీలు తీసుకెళ్లినట్లు పత్రాలు ఉన్నాయని, అయితే మిగిలిన 1,025 కిలోల బంగారు కడ్డీలను తీసుకెళ్లినందుకు సరైన రశీదులు లేవని విచారణ అధికారి తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ బంగారు కడ్డీలు ఉన్న మినీ ట్రక్కు, దాని వెంట వస్తున్న కారును శ్రీపెరంబుదూర్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి తరలించారు. ‘బంగారం మూలం, దానిని ఏ ఉద్దేశంతో రవాణా చేస్తున్నారు’ అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని ఒక అధికారి వ్యాఖ్యానించారు. కాగా, తమిళనాడులోని మొత్తం 39 పార్లమెంట్ స్థానాలకు తొలిదశలోనే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.