బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో అనుమానిత ఉగ్రవాదులు అబ్దుల్ మతీన్ తాహా, ముసావిర్ హుస్సేన్ షాజిబ్‌లను కోల్‌కతాలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుల మొబైల్ ఫోన్ చెడిపోవడంతో దానిని రిపేర్ చేయించుకునే క్రమంలో చిక్కినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. మతీన్, ముసావీర్‌లు కోల్‌కతాలోని చాందినీ చౌక్ మార్కెట్ సమీపంలో ఒక లాడ్జ్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. వారి సెల్‌ఫోన్ చెడిపోవడంతో లాడ్జ్‌కు సమీపంలోని దుకాణంలో దానిని రిపేర్‌కు ఇచ్చారు. మొబైల్‌లో సిమ్ కార్డును నిందితులు ముందే తీసేశారు.
అయితే, సెల్‌ఫోన్ రిపేర్ పూర్తయిన తర్వాత అది పనిచేస్తుందో? లేదో? తెలుసుకోడానికి అందులో సిమ్ కార్డు వేసి పరీక్షించాడు. ఈ సమయంలో ఐఎంఈ నెంబరు ఆధారంగా కాల్ లొకేషన్‌ను ఎన్‌ఐఏ గుర్తించగలిగింది. చాందిని చౌక్‌లోని మైక్రోమ్యాజిక్ ఇన్ఫోటెక్ మొబైల్ దుకాణం లోకేషన్ ట్రేస్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, ఎన్ఐఏ అధికారులు.. షాపు యజమాని అబ్దుల్ రాబ్‌ను ప్రశ్నించారు. ‘ఫోన్ కోసం యువకుడు సాయంత్రం దుకాణానికి వచ్చాడు.. మరింత సమయం పడుతుందని చెప్పాను... మళ్లీ మర్నాడు ఉదయం వచ్చినప్పటికీ రిపేర్ పూర్తికాలేదు..అనుమానితుడి సమాచారం కోసం ఎన్ఐఏ సంప్రదించడంతో గుర్తున్నదంతా వారికి చెప్పాను.. దుకాణంలో సీసీటీవీ ఉన్నా ఎక్కువ స్టోరేజ్ లేకపోవడంతో అనుమానితుడి వీడియో లేదు.. అనుమానితుల ఫోటోలను అధికారులు చూపించడంతో వారిలో ఒకరిని గుర్తించాను’ అని తెలిపారు..
మార్చి 12న కోల్‌కతాకు వెళ్లిన తర్వాత హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్నప్పుడు ఒకరు అసలు పేరు రాయగా.. మరో నిందితుడు తప్పుడు పేరు రాసి, దాన్ని కొట్టివేసి, మళ్లీ అసలు పేరు రాశాడు. తాము పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వచ్చామని అబద్దం చెప్పి గదిని అద్దెకు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. పశ్చిమ్ బెంగాల్‌తో పాటు నిందితులు తిరిగిన ఆయా ప్రాంతాల్లోనూ సోదాలు, తనిఖీలు చేసేందుకు ఎన్‌ఐఏ అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు.
మరోవైపు, రామేశ్వరం కెఫేతో పాటు గతేడాది మంగళూరు కుక్కర్ బాంబు పేలుడులో అబ్దుల్ మతీన్ తాహా, ముసావిర్ హుసేన్ షజీబ్‌ల పాత్రపై ఎన్ఐఏ విచారణ తీవ్రతరం చేసింది. బాంబు పేలుడు ఘటన నిందితులు మహ్మద్ శారిఖ్.. కెఫే పేలుడుకు సంబంధించి అరెస్టు చేసిన అనుమానితులను వేర్వేరుగా విచారణ చేస్తున్నారు. తమిళనాడులో 2022 అక్టోబరులో జరిగిన పేలుడు ఘటనలో చనిపోయిన ఐసిస్ అనుమానిత ఉగ్రవాది జమేశ్ ముబిన్‌కు సంబంధించిన వివరాలను వీరి నుంచి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.