ఇరాన్-ఇజ్రాయేల్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.. ఇరుదేశాల దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతోంది. శనివారం రాత్రి ఇరాన్ వందలాది డ్రోన్, క్షిపణులను ప్రయోగించగా.. వాటిని ఇజ్రాయేల్ విజయవంతంగా అడ్డుకుంది. అయితే, ఇజ్రాయేల్ ప్రతికార దాడులకు పాల్పడుతోందననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి, జీ7, భారత్ సహా ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని ఇజ్రాయేల్, ఇరాన్‌లను కోరాయి. ఇజ్రాయేల్‌పై దాడిని ఖండించిన ఐరాస, జీ7 కూటమి.. దాడులను నిలిపివేయాలని సూచించాయి.
ఈ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్తతలను నివారించడంలో భాగంగా.. ప్రతిదాడులు చేయొద్దని ఇజ్రాయేల్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకార దాడికి తాము మద్దతు ఇవ్వబోమని బైడెన్ తేల్చిచెప్పారు. అందులో తాము భాగస్వాములను కాబోమని ఆయన ఉద్ఘాటించారు. ఇరాన్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన తర్వాత ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు ఫోన్‌లో మాట్లాడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌పై ప్రతిదాడికి దిగొద్దు.. ఒకవేళ అలా చేస్తే అమెరికా నుంచి ఎలాంటి సహకారం ఉండబోదు.. ఇరాన్ ప్రయోగించిన మెజారిటీ డ్రోన్లు, క్షిపణులను కూల్చడమే ఇజ్రాయల్‌కు అతిపెద్ద విజయం. టెల్ అవీవ్‌కు పెద్దగా నష్టం జరగలేదు.. ఈ నేపథ్యంలో ప్రతిదాడులకు దిగడం అనవసరం’ అని నెతన్యాహుకు బైడెన్ స్పష్టం చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రతీకార దాడి వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగి, పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయేల్‌పైకి ఇరాన్ పంపిన దాదాపు 80కి పైగా మానవ రహిత విమానాలు, ఆరు బాలిస్టిక్ క్షిపణులను కూల్చినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఆదివారం ప్రకటించింది. లాంఛర్‌పై ఉండగానే ఓ క్షిపణిని ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఏడు యూఏవీలను ప్రయోగానికి ముందే హూతీల ఆధ్వర్యంలో ఉన్న యెమెన్ భూభాగంపై అడ్డుకున్నట్లు తెలిపింది.
ఇరాన్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ప్రమాదకర కార్యకలాపాలలో అమెరికా పాల్గొనదని, అలాంటి చర్యలకు మద్దతు ఇవ్వదని నెతన్యాహుతో బైడెన్ చెప్పినప్పుడు.. ఆయన సావధానంగా విన్నారని ఓ అధికారి తెలిపారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ శనివారం ఇజ్రాయేల్ మంత్రి గాలంట్‌తో మాట్లాడారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏదైనా ప్రతిస్పందనకి దిగితే ముందుగా తమకు తెలియజేయాలని చెప్పినట్టు ఇజ్రాయేల్ అధికారులు తెలిపారు.
ఇరాన్ దాడులను అడ్డుకున్న తర్వాత జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ..‘అపూర్వమైన దాడుల నుంచి రక్షించుకోడానికి ఇజ్రాయేల్ అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ప్రధాన మంత్రి నెతన్యాహుతో నేను చెప్పాను. ఇజ్రాయేల్ భద్రతను సమర్థవంతంగా బెదిరించలేమని దాని శత్రువులకు స్పష్టమైన సందేశాన్ని పంపింది’ అని వ్యాఖ్యానించారు.