వందలాది డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయేల్‌పై ఇరాన్ దాడికి దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి తర్వాత రెండు వారాల నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి శనివారం ఒక్కసారిగా మరింత వేడెక్కింది. తమ ఉన్నతాధికారులను చంపిన ఇజ్రాయేల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని బెదరింపులకు పాల్పడిన ఇరాన్.. క్షిపణులు, డ్రోన్లను ఆ దేశం దిశగా పంపింది. అయితే, ఈ దాడిని ఇజ్రాయేల్ సమర్దవంతంగా తిప్పికొట్టింది. అమెరికా యుద్ధ విమానాల సాయంతో డజన్ల కొద్దీ డ్రోన్‌లు, క్షిపణులను కూల్చివేసింది. దాదాపు 300కు పైగా డ్రోన్లు, క్షిపణుల దాడికి గురైతే ఏ దేశమైనా చిగురుటాకులా వణికిపోతుంది. కానీ, ఇజ్రాయేల్ మాత్రం బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థతో సునాయాసంగా దాడిని అడ్డుకుంది.
అమెరికా రూపొందించిన గగనతల వ్యవస్థ యూరో, డేవిడ్ స్లింగ్‌తో పాటు దేశీయంగా రూపొందించి ఐరన్ డోమ్, ఐరన్ బీమ్, పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలతో ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్‌ను మధ్యలో కూల్చివేసింది. వందకుపైగా మీడడియా రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు, 30కిపైగా ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లు, 150కిపైగా దాడి డ్రోన్లను ఇరాన్ ప్రయోగించగా.. వాటిని ఇజ్రాయేల్ కూల్చివేసినట్టు అమెరికా సైనికాధికారులు తెలిపారు. అమెరికా యుద్ధ నౌకలు యూఎస్ఎస్ అర్లేహ్ బర్కే, యూఎస్ఎస్ కార్నేలు కూడా నాలుగు నుంచి ఆరు క్షిపణులను, అమెరికా యుద్ధ విమానాలు 70 డ్రోన్లను కూల్చివేసినట్టు చెప్పారు.
యూరో: బాలిస్టిక్ సహా ఏ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణులనైనా అడ్డుకోగల యూరోకి భూవాతావరణం వెలుపలా పనిచేసే సామర్థ్యం ఉంది. హమాస్‌తో యుద్ధంలో హూతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణులను ఈ వ్యవస్థతోనే ఇజ్రాయేల్ అడ్డుకుంటోంది.
డేవిడ్ స్లింగ్: మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకునే ఈ వ్యవస్థతోనే లెబనాన్ నుంచి హెజ్‌బొల్లా తీవ్రవాదులు ప్రయోగించే మిసైళ్లను ఇజ్రాయేల్ కూల్చివేస్తోంది.
పేట్రియాట్: ఇజ్రాయేల్ చాలాకాలం నుంచి వినియోగించే ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ గురించి 1991 గల్ఫ్ యుద్ధంలో మార్మోగిపోయింది. ఇరాక్ ప్రయోగించిన స్కడ్ క్షిపణులను ఇవి విజయవంతంగా అడ్డుకున్నాయి. ప్రస్తుతం వీటిని విమానాలు, డ్రోన్లు కూల్చడానికి ఇజ్రాయెల్ ఉపయోగిస్తోంది.
ఐరన్ డోమ్: అమెరికా సహకారంతో ఇజ్రాయేల్ తయారుచేసిన ఈ వ్యవస్థ తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లను అడ్డుకుంటుంది. గత కొన్నేళ్లుగా లెబనాన్ హెజ్‌బొల్లా, గాజా నుంచి హమాస్ ప్రయోగించే రాకెట్లను డోమ్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తోంది. ప్రత్యర్థి రాకెట్లు ప్రయోగించగానే ఈ వ్యవస్థ ఆటోమేటిగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది.
ఐరన్ బీమ్: ఇజ్రాయేల్ కొత్తగా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ.. లేజర్ సాంకేతికతతో పనిచేస్తుంది. మిగతా గగన రక్షణ వ్యవస్థలతో పోలిస్తే అతి చౌక. ఇరాన్ శనివారం చేసిన దాడిలోనూ ఈ లేజర్ వ్యవస్థను వాడినట్లు తెలుస్తోంది.