శ్రీనగర్‌లోని జీలం నదిలో మంగళవారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. పడవ బోల్తాపడి ఆరుగురు చిన్నారుల మృతిచెందగా.. మరో పది మంది గల్లంతయ్యారు. నదిని దాటేందుకు ఉపయోగించే తాడు అకస్మాత్తుగా తెగిపోవడంతో పడవ బోల్తా పడిందని అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు జీలం నదిలో ప్రవాహం ఎక్కువగా ఉందని, దీంతో ప్రాణనష్టం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాద సమయానికి పడవలో మొత్తం 20 మంది వరకూ ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది పిల్లలే అన్ని చెప్పారు. మరో 10 మంది గల్లంతయ్యారని, వారి కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నామని వివరించారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో సోమవారం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. కిష్టావర్ పథార్ వద్ద కొండచరియలు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రకాపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జమ్మూ కశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి.. కశ్మీర్ లోయను దేశానికి అనుసంధానం చేస్తుంది.