ఇండిగో విమానంలో ప్రయాణికులకు అత్యంత భయానక అనుభవం ఎదురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయోధ్య నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలోని ప్రయాణికులు దాదాపు 2 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏప్రిల్ 13న జరిగిన ఈ సంఘటన గురించి ఓ ప్రయాణికుడు ‘ఎక్స్’ ద్వారా పంచుకున్నాడు. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలో రెండుసార్లు ల్యాండింగ్‌కు ప్రయత్నించి విఫలం కావడంతో విమానం చండీగఢ్‌కు మళ్లించారని, అక్కడ కేవలం 2 నిమిషాలకు సరిపడే ఇంధనంతోనే విమానం ల్యాండయ్యిందని పేర్కొన్నాడు.
‘ఇండిగో విమానం 6ఇ 2702 అయోధ్యలోని మర్యాద పురుషోత్తమరామ విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 13న మధ్యాహ్నం 3.25 గంటలకు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో దిగాల్సి ఉంది.. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌కు వీలుపడటం లేదని, మరో 45 నిమిషాల వరకు సరిపడా ఇంధనం మిగిలి ఉందని సరిగ్గా 4.15 గంటలకు పైలెట్ ప్రకటించారు.. పైలట్ రెండుసార్లు ల్యాండింగ్‌కు ప్రయత్నించినా సాధ్యం కాలేదు... చివరకు సాయంత్రం 5.30 గంటలకు విమానం చండీగఢ్‌కు మళ్లిస్తున్నట్లు ప్రకటించారు..
115 నిమిషాల తర్వాత విమానం సాయంత్రం 6.10 గంటలకు చండీగఢ్ విమానాశ్రంలో సురక్షితంగా దిగడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే ఆ సమయానికి విమానంలో మరో 2 నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే మిగిలి ఉంది’ అని సతీశ్ కుమార్ అనే ప్రయాణికుడు పేర్కొన్నాడు. ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని డీజీసీఎ, ఇండిగోలకు ట్యాగ్ చేశాడు. అయితే, దీనిపై ఇండిగో మాత్రం మరోలా స్పందించింది. ప్రత్యామ్నాయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సరిపడా ఇంధనం ఉందని పేర్కొంది. కెప్టెన్ ప్రామాణిక ఆపరేటింగ్ విధానానికి అనుగుణంగా గో-అరౌండ్‌ను అమలు చేశారని, ఇది పూర్తిగా సురక్షితమైందని ఇండిగో అధికా ప్రతినిధి వెల్లడించారు. ‘నిబంధనల ప్రకారం, ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి మళ్లించడానికి విమానం అన్ని సమయాల్లో తగినంత ఇంధనాన్ని కలిగి ఉంది. ప్రయాణీకుల భద్రత మాకు చాలా ముఖ్యమైనది. మా సంస్థ నియంత్రణకు మించి కారణాల వల్ల ఏదైనా అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం’ అని పేర్కొన్నారు.