ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై క్యాట్ (కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్)లో వాదనలు ముగిశాయి. తనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై క్యాట్ జ్యుడిషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్, నాన్ జ్యుడిషియల్ సభ్యురాలు శాలినీ మిస్త్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఏబీవీని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఏబీ వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ లాయర్ ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఆయన సాక్షులను బెదిరించినట్లు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం.. అధికారుల కమిటీ ఎప్పటికప్పుడు సస్పెన్షన్‌ను సమీక్షించటంలో విఫలమైతే ఆ సస్పెన్షన్ చెల్లదన్నారు. అంతేకాదు ఆ సస్పెన్షన్ కొనసాగదని.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లో చేర్చుకున్నా సరే.. అంతకు ముందు చేసిన పాత ఆరోపణలతోనే ఆయన్ను రెండోసారి సస్పెండ్ చేశారన.. దీనికి ఎలాంటి కారణం లేదన్నారు.
సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు ఎక్కడున్నాయని అడిగిన ప్రశ్నకు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సమాధానమివ్వలేదని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన లిఖితపూర్వక వాదనల్లో తప్పులున్నాయని ఆదినారాయణరావు తన వాదనలో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ పి.శ్రీరాం వాదనలు వినిపించడంతోపాటు పలు పత్రాలను క్యాట్‌కు అందజేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును ఈ నెల 23కు వాయిదా వేసింది.
ఏబీ వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ వింగ్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో ఆయనపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుల చేయడంతో.. ఎన్నికల సంఘం ఆ పదవి నుంచి తప్పించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు కొనుగోలు చేశారని ఏబీవీపై ప్రభుత్వం ఆరోపణలు చేసి ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన విధుల్లోకి చేరగా.. రెండోసారి సస్పెండ్ చేయడంతో క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఈ నెల 23న ఎలాంటి తీర్పును వెల్లడిస్తుందన్న ఆసక్తికరంగా మారింది. ఏబీ వెంకటేశ్వరరావు దాదాపు ఐదేళ్లుగా విధులకు దూరంగా ఉంటున్నారని చెప్పాలి.. అంతేకాదు త్వరలోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఆలోపు క్యాట్‌లో ఊరట దక్కుతుందా లేదా అన్నది చూడాలి.. ఒకవేళ క్యాట్ అనుకూలంగా తీర్పు ఇచ్చినా కొంతకాలమే ఆయన విధుల్లో ఉంటారు. మరి ఏబీ వెంకటేశ్వరరావు భవితవ్యం తేలాలంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే.