యూపీపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేనురాజు కుమారుడు ర్యాంకు సాధించారు. మోసేను రాజు కుమారుడు చిట్టిరాజు 833వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి మోసేనురాజు దంపతులు స్వీట్ తినిపించారు. గునుపూడి ప్రాంతంలో యువత సంబరాలు చేశారు. భీమవరంలో ప్రాథమిక విద్య అనంతరం ఏయూలో బీటెక్ పూర్తి చేసిన చిట్టిరాజు రెండేళ్ల పాటు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేశారు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో 2018 నుంచి డిల్లీలో ఉంటూ పట్టుదలతో చదివారు.. చివరికి అనుకున్నది సాధించారు.
మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలికి చెందిన యువతి గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షల్లో సత్తా చాటారు. జాతీయ స్థాయిలో 198వ ర్యాంకు సాధించారు. ఈమె గతంలో గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు పొందడం ద్వారా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈమె తండ్రి రామాంజనేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి ఉష గృహిణి. భానుశ్రీ ఢిల్లీలోని ఓ కాలేజీలో బీఏ ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ చదివారు.
భానుశ్రీ చిన్నతనం నుంచి ఐఏఎస్ అధికారి కావాలనే ఆశయం ఉండేది. ఆమె లక్ష్య సాధనకు తండ్రి అండగా నిలుస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీలో ఉత్తమ ర్యాంకు సాధించారు. ఐపీఎస్ లేదా ఐఆర్‌ఎస్ హోదా లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తాను విజయాలు సాధించడానికి తండ్రి అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని భానుశ్రీ తెలిపారు. ఐఏఎస్ అధికారి కావాలనేది తన జీవితాశయమన్నారు.