ట్రాఫిక్ నియమాలు పాటిస్తే రోడ్లపై ప్రమాదాలు జరగకుండా ఉంటాయని పోలీసులు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. అయితే కొందరు తెలియకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే.. మరికొందరు వాహనదారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కొందరు ఎన్ని ట్రాఫిక్ చలాన్లు పడినా తమకేమీ పట్టనట్టు రోడ్లపై వెళ్తూనే ఉంటారు. ఇలాగే ఓ మహిళ తన స్కూటీతో రోడ్డుపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఏకంగా ఆమె స్కూటీపై 270 చలాన్లు వేశారు. వాటి విలువ అక్షరాలా రూ.1.36 లక్షలు కావడం గమనార్హం. చివరికి ఆమె స్కూటీని సీజ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరుకు చెందిన ఓ మహిళకు ఈ షాకింగ్ అనుభవం కలిగింది. తన హోండా యాక్టివా స్కూటీపై ఏకంగా 270 ఫైన్లు పడగా.. వాటి విలువ మొత్తం రూ.1.36 లక్షలు అయింది. హెల్మెట్ ధరించకపోవడం, స్కూటీపై ట్రిపుల్ రైడింగ్ చేయడం, రాంగ్ రూట్‌లో వెళ్లడం, సిగ్నల్ పడినా ఆపకుండా దూసుకెళ్లడం, బండి నడుపుతున్నపుడు ఫోన్ మాట్లాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇవన్నీ బెంగళూరు నగరంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
రూ.1.36 లక్షల జరిమానాలు విధించడంతో తన వాహనం ధర కంటే ఈ చలాన్ల విలువ రెట్టింపు ఉంటుందని ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అన్ని చలాన్లు పడినా వాటిని కట్టకుండా.. మళ్లీ మళ్లీ ఆ మహిళ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో విసిగిపోయిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.. చివరికి ఆమె హోండా యాక్టివా స్కూటర్‌ను సీజ్ చేశారు. అయితే ఈ రూ.1.36 లక్షల ఫైన్ ఆ మహిళ చెల్లించి కేసులను పరిష్కరించుకుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అన్ని చలాన్లు పడేవరకు ఏం చేశావని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరైతే సూపర్ ఉమెన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక గతేడాది డిసెంబర్‌లో ఇదే బెంగుళూరులో కూడా ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తికి తన టూవీలర్‌పై 255 ట్రాఫిక్ చలాన్లు పడ్డాయి. వాటి విలువ రూ.1.34 లక్షలు కాగా.. వాటిని చెల్లించాలని ఆ వ్యక్తికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.