మన దేశంలోనే సివిల్స్ జాబ్ అంటే అత్యున్నతమైన ఉద్యోగం. ఇక ఈ సివిల్స్ ఉద్యోగం సాధించాలని ఏటా కొన్ని లక్షల మంది పరీక్షలు రాస్తూ ఉంటారు. అందులో కొందరికి ఉద్యోగాలు వస్తే మరికొందరు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటారు. సివిల్స్ ఉద్యోగం సాధించడం అంటే అంత తేలికైన విషయం కాదు. దానికి ఎంతో కృషి, పట్టుదల కావాల్సిందే. అందుకోసమే లక్షలాది మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో నెలలు, సంవత్సరాల తరబడి కోచింగ్‌లు తీసుకుంటూ ఉంటారు. మంచి మంచి ఉద్యోగాలను కూడా కాదని వచ్చి.. సివిల్సి కోచింగ్ తీసుకుని జాబ్ కొట్టినవారు ఎంతో మంది ఉంటారు. అలాంటి కోవలోకే చెందుతుంది ఢిల్లీకి చెందిన వార్దా ఖాన్. ఈ 24 ఏళ్ల యువతి.. కార్పొరేట్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ.. ప్రిపేర్ అయి ఇటీవల విడుదలైన యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 18 వ ర్యాంకు సాధించింది.
నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్‌లో నివసించే వార్దా ఖాన్.. ప్రస్తుతం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 18 వ ర్యాంక్ సాధించింది. అయితే తన తొలి ప్రిఫరెన్స్‌గా ఇండియన్ ఫారిన్ సర్వీస్-ఐఎఫ్ఎస్‌ను సెలెక్ట్ చేసుకుంది. ప్రపంచంలోనే భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది. అందరు అభ్యర్థుల లాగానే తన ప్రిపరేషన్ కూడా జరిగిందని ఆమె చెప్పింది. సివిల్స్ ర్యాంక్ కొట్టాలని టార్గెట్ ఉండేదని చెప్పిన వార్దా ఖాన్.. కానీ 18 ర్యాంక్ వస్తుందన్న ఊహించలేదని పేర్కొంది. సివిల్స్ సాధించడంతో తన కల నెరవేరినట్లు అయిందని.. ప్రస్తుతం తన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడించింది.
ఢిల్లీ వర్సిటీలోని ఖల్సా కాలేజీ నుంచి బీకామ్ హానర్స్ పూర్తి చేసిన వార్ధా ఖాన్.. గతంలో ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేసేది. ఆమె తండ్రి 9 ఏళ్ల క్రితం మరణించగా.. ప్రస్తుతం ఆమె తల్లితోనే కలిసి నివసిస్తోంది. కాలేజీ రోజుల్లో.. తనకు జియోపాలిటిక్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. హిస్టరీ, పాలిటీ సబ్జెక్టులు అంటే ఇష్టమని పేర్కొంది. ఇక కాలేజీ రోజుల్లో ఎక్కువగా డిబేట్లలో పాల్గొనేదానిని అని.. అయితే ఆ సమయంలో సివిల్స్ సాధించాలనే ఆలోచన లేదని చెప్పింది.
అయితే కార్పొరేట్ జాబ్ చేస్తున్నపుడు సివిల్ సర్వెంట్ కావాలనే కోరిక కలిగిందని పేర్కొంది. ఆ ఉద్యోగం 8 నెలలు చేశానని.. ఆ ఉద్యోగం నచ్చక సివిల్స్ వైపు అడుగు వేసినట్లు తెలిపింది. తాను ఇంటి వద్దే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యానని.. ఏడాది పాటు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నట్లు చెప్పింది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను తప్పకుండా ఫాలోకావాలని వార్దా ఖాన్ సలహా ఇచ్చారు.