రాముడి ఆదర్శాలు ఈనాటికీ ఆచరణీయాలే అన్నారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్. ప్రతి కణంలోనూ, సృష్టి అంతటా నిండి ఉన్న శక్తే రాముడు.. రాముడు అందరి జీవితానికి వెలుగు దివ్వెగా అభివర్ణించారు. 'తరచుగా మనం మనలోని కాంతిని కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. నీవే ఆ వెలుగు అని తెలుసుకో. నీవు కేవలం రక్తం, మాంసం, ఎముకలు మాత్రమే కాదు. నీవే ఆ వెలుగు. ఈ అవగాహన కలిగి ఉన్నప్పుడు, మీరు అన్ని మానసిక క్షోభల నుండి విముక్తి పొందుతారు. జీవితంలో శాంతి కలుగుతుంది. రాముడు సంఘర్షణల జీవితంలో ఎఱుకను, శాంతిని బోధిస్తాడు'అన్నారు రవిశంకర్.
నిద్ర లేవగానే మొదటగా ప్రతి ఒక్కరూ గమనించే విషయం ఏమంటే.. ఈ జీవితం ఒక పోరాటం అన్నారు. ప్రపంచంలో సంఘర్షణ ఉంది, సంబంధాలలో సంఘర్షణ ఉంది, జీవితంలో దాదాపు ప్రతి మలుపులోనూ సంఘర్షణ ఉందని వ్యాఖ్యానించారు. 'కానీ మీరు మరింత ఎఱుక కలిగి ఉన్నపుడు, అవగాహనతో ఉన్నప్పుడు, మీ బుద్ధి వికసించినప్పుడు, ఇదంతా ఒక ఆట, లీల అని గ్రహిస్తారు. మొదట యుద్ధంగా కనిపించినదే, తరువాత ఆటగా కనిపిస్తుంది. రాముని జీవితం పోరాటాలతో నిండి ఉంది, అయినప్పటికీ అతను జీవితంలో ప్రతీ పాత్రనూ సత్య ధర్మాలకు కట్టుబడి పోషించాడు. సంపూర్ణమైన ఎఱుకతో, దయ, నిజాయితీ, భక్తి కలిగి జీవించాడు' అన్నారు.
ఎఱుకను కలిగి ఉండి, వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు, ఎవరినీ మీ శత్రువుగా చూడలేరని అభిప్రాయపడ్డారు. 'మీరు ఎవరినైనా మీ శత్రువుగా చూసినప్పుడు, అది మీకు నిజంగా కనిపిస్తుంది. మీరు దానిని విశ్వసించడం ప్రారంభిస్తారు. ఔనా? భావోద్వేగాలు అలానే ఉంటాయి. అవి అలా వచ్చి మనల్ని ఆక్రమిస్తాయి. ఆ సమయంలో, మీలోని తర్కం వెనకడుగు వేస్తుంది. కానీ భావోద్వేగాలు మీపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని మీరు గుర్తించిన వెంటనే, మీఅంతట మీరే దాని నుండి వెనక్కు వస్తారు. అప్పుడిక మీరు సంఘర్షణలలో సైతం సంతోషంగానే ఉంటారు' అన్నారు రవిశంకర్.
రాముడు క్రమశిక్షణకు ప్రతిరూపం
రాముడి జీవితం మనందరికి క్రమశిక్షణ నేర్పుతుందన్నారు రవిశంకర్. క్రమశిక్షణ మూడు విధాలుగా అందరి జీవితంలో భాగమవుతుందని.. మొదట, 'మీరు' గల ప్రేమ వలన క్రమశిక్షణతో మెలగుతారన్నారు. ప్రేమకు క్రమశిక్షణ అవసరం లేనప్పటికీ, ప్రేమ క్రమశిక్షణను పాటించేలా చేస్తుందన్నారు. భయం, దురాశ వల్ల కూడా క్రమశిక్షణను పాటిస్తామమని.. ఎవరైనా 'మీకు' క్రమశిక్షణగా ఉండకపోతే నష్టపోతారని చెబితే కేవలం అత్యాశ, భయం వల్ల క్రమశిక్షణ పాటిస్తారన్నారు. 'ఒక వైద్యుడు, మీరు మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో ఉంచుకోకపోతే మీరు అనారోగ్యానికి గురవుతారని చెబితే, అప్పుడు కూడా మీరు ఆరోగ్యం పాడౌతుందనే భయంతో ఆయా నియమాలను పాటిస్తారు. కానీ విధేయత, ప్రేమ కలిగి ఉండి, క్రమశిక్షణతో ఉండటమే గొప్పదనం'అన్నారు.
రామనామం విజయానికి పర్యాయపదం
విజయం ఎల్లప్పుడూ రాముడితో ముడిపడి ఉంటుందన్నారు రవిశంకర్. రామబాణం ఎన్నడూ గురితప్పదని సామెత ఉందని.. అందుకే నేటికీ రామబాణం అనే పదాన్ని సర్వరోగ నివారిణి లేదా ఏదైనా సమస్యకు అంతిమ పరిష్కారం అనే అర్థంలో ఉపయోగిస్తారని తెలిపారు. ప్రతి వ్యక్తీ విజయం పొందాలనే కోరుకుంటాడు, కానీ దాని అర్థం ఏమిటో మనకు నిజంగా తెలియదన్నారు. నిజమైన విజయం భౌతిక విజయం మాత్రమే కాదని.. 'నీ ముఖంలో ఎవ్వరూ దొంగిలించలేని దృఢమైన చిరునవ్వు ఉండాలి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా తగ్గని ధైర్యం మీలో ఉండాలి. ఇది నిజమైన విజయానికి సంకేతం. రాగద్వేషాలు లేకుండా జీవితంలోని అన్ని అంశాలను సమతుల్యం చేసుకుటూ ముందుకు సాగడమే నిజమైన విజయం' అని అభిప్రాయపడ్డారు.
ఈ రామ నవమికి మీలోని దీపాన్ని వెలిగించాలన్నారు గురుదేవ్ రవిశంకర్. 'రాముడు సనాతన పంచాగం ప్రకారం చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు. అన్ని చింతలనూ వదలివేసి వర్తమాన క్షణంలో జీవించాలని ఈ దినం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి సంతోషంగా, సంతృప్తిగా ఉండండి, పాత ఫిర్యాదులన్నింటినీ ఈ క్షణంలోనే వదిలేయండి. మీ చిరునవ్వును, ప్రేమను అందరితో పంచుకోండి. రాముడు ఏనాడూ ఉపదేశాలు ఇవ్వలేదు, అయినా అతని ఆదర్శ జీవనం యుగయుగాలుగా మానవాళికి ఆదర్శంగా ఈనాటికీ నిలిచి ఉంది' అన్నారు రవిశంకర్. రామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.