జపాన్‌లో రైళ్లు సమయానికి నడుస్తాయి. ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైనా కేవలం 1 నిమిషం లోపే ఆలస్యం ఉంటుంది. ఇక బుల్లెట్ రైళ్లు అయితే సమయానికి స్టేషన్‌కు చేరుకుంటాయి. కొన్నిసార్లు అయితే కొన్ని సెకన్ల ముందే గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇక జపాన్‌లో బుల్లెట్ రైలు ప్రారంభమై 60 ఏళ్లు పూర్తయింది. అయితే ఈ 6 దశాబ్దాలలో ఇప్పటివరకు ఎన్నడూ లేనిది.. తాజాగా ఓ బుల్లెట్ రైలు ఏకంగా 17 నిమిషాలు ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకుంది. 17 నిమిషాలు తక్కువే అయినా.. జపాన్‌లో మాత్రం 17 నిమిషాలు అంటే చాలా ఎక్కువ.
జపాన్‌లోని నగోయా-టోక్యో నగరాల మధ్య మంగళవారం ప్రయాణించిన ఒక షింకాన్‌సెన్ రైలు ఏకంగా 17 నిమిషాలు ఆలస్యం కావడం ప్రస్తుతం ఆ దేశంలో తీవ్ర చర్చకు దారి తీసింది. జపాన్‌లో బుల్లెట్ రైలును షింకాన్‌సెన్ రైలు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బుల్లెట్ రైలు ఆలస్యం కావడానికి ఓ పాము కారణం అయింది. అయితే ఆ రైలులో పామును గుర్తించిన ఓ ప్రయాణికుడు.. వెంటనే రైల్వే సిబ్బందిని అలర్ట్ చేయడంతో అప్రమత్తమైన అధికారులు బుల్లెట్ రైలును నిలిపివేశారు. చివరికి ఆ పామును గుర్తించి తొలగించి.. రైలు ప్రయాణం చేసి స్టేషన్‌కు చేరుకునే వరకు 17 నిమిషాలు ఆలస్యం అయింది.
మంగళవారం సాయంత్రం నగోయా - టోక్యో మధ్య ప్రయాణిస్తున్న బుల్లెట్ రైలులో 40 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఓ పాము.. ప్రయాణికుడికి కనిపించింది. దీంతో రైల్వే అధికారులకు సమాచారం అందించగా.. ఆ రైలును నిలిపివేశారు. అయితే ఆ పాము విషపూరితమైందా కాదా అనేది అధికారులు వెల్లడించలేదు. మరోవైపు.. అసలు ఆ పాము బుల్లెట్ రైలులోకి ఎలా ప్రవేశించింది అనేది కూడా చెప్పలేదు. పాము బుల్లెట్ రైలులోకి దూరిన ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ఈ బుల్లెట్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ వెంట పావురాలు, చిన్న కుక్కపిల్లలను తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే పాముల లాంటి విషపు జంతువులకు మాత్రం అనుమతి లేదు. అయితే ప్రయాణికులు తీసుకువచ్చే లగేజీని తాము తనిఖీ చేయబోమని జపాన్ రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
జపాన్‌లో 1964 అక్టోబరు 1 వ తేదీన.. బుల్లెట్ రైలు ప్రారంభమైంది. ముందుగా టోక్యో నుంచి ఒసాకా నగరాల మధ్య ఈ బుల్లెట్ రైలు ప్రారంభం కాగా.. ప్రస్తుతం జపాన్‌లో షింకాన్‌సెన్ నెట్‌వర్క్.. 2700 కిలోమీటర్లకు విస్తరించింది. మొదట్లో ఈ బుల్లెట్ రైలు గరిష్ఠ వేగం గంటకు 210 కిలోమీటర్లు కాగా.. ఆ తర్వాత గంటకు 300 కిలోమీటర్లకు పెంచారు. సాధారణంగా గంటకు 285 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు సరాసరి ఆలస్య సమయం కేవలం 0.2 నిమిషాలు కావడం గమనార్హం.