ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పొందేందుకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఈడీ ఆరోపించింది. డయాబెటిక్ పేషంట్ అయిన కేజ్రీవాల్.. తన షుగర్ లెవల్స్ పెంచుకుని.. ఆ తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ కింద బెయిల్ పొందేలా చూస్తున్నారని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. ఇక జైలులో ఉన్న కేజ్రీవాల్.. తన షుగర్ లెవల్స్ పెంచుకోవడానికి మామిడి పండ్లు, స్వీట్లు, చక్కెర కలిపిన టీ తాగుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ పదార్థాలు అన్నీ తీసుకుంటున్నారని.. ఈడీ లాయర్ గురువారం కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈడీ తరఫు లాయర్ చేస్తున్న వాదనలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది కొట్టిపారేశారు.
తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. తనకు షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని ఇటీవల కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన షుగర్ లెవల్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి 3 సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ గురించి.. ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది.
కావాలనే ఇంటి నుంచి తెప్పించుకుని.. స్వీట్లు, మామిడి పండ్లు.. అరవింద్ కేజ్రీవాల్ జైలులో తింటున్నారని ఈడీ తెలిపింది. అవి తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని పేర్కొంది. షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలను చూపుతూ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పొందాలని అనుకుంటున్నారని ఈడీ అధికారులో కోర్టులో ఆరోపించారు. అయితే ఈడీ చేస్తోంది అంతా అబద్ధపు ప్రచారమేనని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ ఈడీ సమర్పణల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో భాగంగా గత నెల 21 వ తేదీన ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు.