ప్రముఖ మేగజీన్ టైమ్ అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితా 2024లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ సహా పలువురు భారీతీయులకు చోటు దక్కింది. అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్ జిగర్ షా, యేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రియంవదా నటరాజన్, భారత సంతతికి చెందిన రెస్టారెంటు యజమాని అస్మా ఖాన్, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ సతీమణి యులియా ఈ జాబితాలో ఉన్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా ప్రొఫైలన్‌ను అమెరికా ఆర్థిక శాఖ మంత్రి జానెట్ యెలెన్ రాశారు.
‘ఓ కీలక ఆర్ధిక సంస్థను పరివర్తన చెందించే అత్యంత ముఖ్యమైన పనిని చేపట్టేందుకు నైపుణ్యం, ఉత్సుకత ఉన్న నాయకుడిని గుర్తించడం అత్యంత క్లిష్టమైంది.. కానీ, గత జూన్‌లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అజయ్‌బంగా ఆ పనిని చేసి చూపించారు’ అని ఆయన కొనియాడారు. సత్య నాదెళ్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన మన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తీవ్ర ప్రభావం చూపుతున్నారు. మానవాళికి అది మంచి విషయం కూడా’ అని టైమ్ మేగజీన్ కితాబిచ్చింది.
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగిక వేధింపులపై పోరాటానికి రెజ్లర్ సాక్షి మాలిక్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్, వినేశా ఫోగట్, బజరంగ్ పూనియాలు ఢిల్లీలో చేపట్టిన నిరసన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారి పోరాటంతో బ్రిజ్ భూషణ్‌పై కేంద్రం చర్యలు తీసుకుంది. తొలుత పోలీసులు స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే ఆయన్ను పదవి నుంచి తొలగించారు.
టైమ్ మేగజీన్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ..‘ మాలిక్, ఆమె సహచరులు నాయకత్వం వహించిన ఈ ఉద్యమం భారతీయ క్రీడలలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తించింది.. న్యాయం కోసం కేంద్రీకృత డిమాండ్ నుంచి ఒక ఏడాది పాటు సాగిన యుద్ధంగా మారింది.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత మద్దతును పొందింది.. ఆమె పోరాటం ఇప్పుడు భారత్‌లో మహిళా రెజ్లర్ల కోసం మాత్రమే కాకుండా దేశంలోని ఆడపిల్లల కోసం పదేపదే గొంతుక వినిపించారు.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, ఆమె యుద్ధాన్ని విడిచిపెట్టలేదు.. వేధింపులకు వ్యతిరేకంగా నిలబడిన వారందరి కాంతి ప్రకాశిస్తూనే ఉన్నారు’ అని ప్రశంసించింది.