దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న నెస్లే బేబీ-ఫుడ్ బ్రాండ్‌లలో చక్కెర శాతం అధికంగా ఉన్నట్టు తాజాగా ఓ అధ్యయనం బయటపెట్టింది. అయితే, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ స్విట్జర్లాండ్ సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో ఇటువంటి ఉత్పత్తులు చక్కెర రహితంగా ఉన్నాయని పబ్లిక్ ఐ పరిశోధనలో వెల్లడయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ వస్తువుల సంస్థ నెస్లే.. అనేక దేశాల్లో శిశువుల పాలు, తృణధాన్యాల ఉత్పత్తులకు చక్కెర, తేనెను కలుపుతోందని, స్థూలకాయం,. దీర్ఘకాలిక వ్యాధులను నివారించే లక్ష్యంతో అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని నివేదిక ఆరోపించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో మాత్రమే ఉల్లంఘనలు జరిగినట్టు పేర్కొంది.
అయితే, నెస్లే ఇండియా తన శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెరలను గత ఐదేళ్లలో 30% తగ్గించిందని, వాటిని మరింత తగ్గించడానికి ఉత్పత్తులను సమీక్ష, "పునరుద్ధరణ కొనసాగిస్తుందని ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ‘చిన్నారుల మా ఉత్పత్తుల పోషక నాణ్యతను మేము విశ్వసిస్తున్నాం.. అధిక-నాణ్యత గల పదార్థాలను ఉపయోగించడానికి ప్రాధాన్యతనిస్తాం’ అని ఇది ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలోని మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రోడక్ట్స్‌లో ఒక్కోదానిలో సగటున దాదాపు 3 గ్రాముల చక్కెర ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అదే ఉత్పత్తిని జర్మనీ, యూకేలో మాత్రం చక్కెర లేకుండా విక్రయిస్తున్నాయని, ఇథియోపియా, థాయ్‌లాండ్‌లలో దాదాపు 6 గ్రాములు కలిగి ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. కానీ, ఇటువంటి ఉత్పత్తుల న్యూట్రిషన్ సమాచారంలో మాత్రం వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.
‘నెస్లే తన ఉత్పత్తులలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలను ఆకర్షణీయమైన ఫోటోలను ఉపయోగించి ముఖ్యంగా హైలైట్ చేస్తున్నప్పటికీ, చక్కెరను జోడించినప్పుడు ఇది పారదర్శకంగా ఉండదు’ అని నివేదిక పేర్కొంది. నెస్లే 2022లో రూ.20,000 కోట్ల విలువైన సెరెలాక్ ఉత్పత్తులను విక్రయించింది. పిల్లల ఉత్పత్తులకు చక్కెరను కలపడం ప్రమాదకరమైన, అనవసరమైన పద్ధతి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘ఇది ఆందోళన కలిగించే అంశం.. శిశువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారాలలో చక్కెరను కలపరాదు.. ఎందుకంటే ఇది అనవసరమైంది, అధిక ప్రమాదకర అలవాటుగా మారుతుంది’అని బ్రెజిల్‌లోని పరైబా ఫెడరల్ యూనివర్శిటీ న్యూట్రిషన్ విభాగంలో ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ రోడ్రిగో వియాన్నా చెప్పారు.
"పిల్లలు తీపి రుచికి అలవాటు పడతారు.. ఎక్కువ చక్కెర ఆహారాల కోసం వెతకడం ప్రారంభిస్తారు.. పెద్దయ్యాక పోషకాహార ఆధారిత రుగ్మతల ప్రమాదాన్ని పెంచే ప్రతికూల ప్రభావం ఉంటుంది.. వీటిలో ఊబకాయం, మధుమేహం లేదా అధిక రక్తపోటు, ఒత్తిడి వంటి ఇతర దీర్ఘకాలిక అసాంక్రమిత వ్యాధుల ముప్పు ఉంది’ ఆయన అన్నారు.