లాటరీ టికెట్ గెలవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. కొందరు ఏళ్ల తరబడి ఆస్తులు అమ్ముకుని మరీ లాటరీ టికెట్లు కొన్నా.. ఒక్కసారి కూడా జాక్‌పాట్ కొట్టలేరు. కానీ ఇద్దరు కరుడుగట్టిన దొంగలు మాత్రం.. ఈజీగా లాటరీ కొట్టారు. అయితే వారు కొన్న లాటరీ టికెట్ డబ్బులు చెల్లించేందుకు ఉపయోగించిన క్రెడిట్ కార్డు కూడా వారు దొంగలించిందే కావడం ఇక్కడ ట్విస్ట్. ఎలాగోలా దొంగతనం చేసి లాటరీ టికెట్ కొనుగోలు చేయగా.. వారు కొన్న టికెట్.. లాటరీలో బంపరాఫర్ గెలుచుకుంది. ఏకంగా రూ.41.66 కోట్ల లాటరీ వారికి తగలడంతో.. లైఫ్ సెటిల్ అనుకుంటూ వారు సంతోష పడ్డారు. కానీ వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ఆ లాటరీ జాక్‌పాట్ తగలడమే.. దొంగలను పట్టించింది. ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది.
యూకే లోని బోల్టన్‌కు చెందిన జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు ఇద్దరు కరుడుగట్టిన దొంగలు. వాట్సన్‌పై 133 నేరాలు రుజువు కాగా.. అందులో 72 కేసుల్లో శిక్ష కూడా పడ్డాయి. మరోవైపు.. గూడ్‌రామ్‌పై 45 క్రిమినల్ నేరాలు నమోదు కాగా.. అందులో 22 కేసుల్లో శిక్ష పడింది. ఇంతటి కరుడు గట్టిన దొంగలు.. ఒక వ్యక్తి దగ్గరి నుంచి క్రెడిట్ కార్డును కొట్టేశారు. ఆ క్రెడిట్ కార్డును ఉపయోగించి వారు ఒక లాటరీ టికెట్ కూడా కొనుగోలు చేశారు. వారి అదృష్టమో, దురదృష్టమో ఆ లాటరీలో ఆ టికెట్ ప్రైజ్‌మనీ గెలిచింది. ఇంతా అంతా ప్రైజ్‌మనీ కాకుండా 4 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.41.66 కోట్లు గెలుచుకున్నారు.
చోరీ చేసిన క్రెడిట్ కార్డుతో లాటరీ టికెట్ కొనుగోలు చేయడం.. ఆ లాటరీలో వారు జాక్‌పాట్ కొట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ గెలిచిన ఆనందంలో డబ్బును పొందేందుకు వారు ఆ లాటరీ నిర్వాహకుల వద్దకు వెళ్లారు. అయితే వారి బ్యాంకు అకౌంట్, అడ్రస్ వివరాలు అడిగారు. అయితే ఆ లాటరీ టికెట్‌ను దొంగిలించిన క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేయడంతో.. ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు వారి వద్ద లేవు. దీంతో వారు అనుమానంగా వివరాలు చెప్పడంతో ఆ లాటరీ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. తమదైన స్టైల్‌లో విచారణ చేయగా.. అసలు విషయం బయటపడింది. తాము కొన్న లాటరీ టికెట్‌ను చోరీ చేసిన క్రెడిట్ కార్డుతో కొన్నట్లు తెలిపారు. దీంతో వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో వారిద్దరినీ కోర్టులో హాజరుపరచగా.. ఇద్దరికీ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. ఇక ఆ క్రెడిట్ కార్డు యజమాని గురించి ఆరా తీసిన పోలీసులు.. అతడిని జోషువాగా గుర్తించారు. దీంతో ఆ రూ.41.66 కోట్ల లాటరీ మొత్తాన్ని ఆయనకు అందించే అవకాశం ఉందని లాటరీ నిర్వాహకులు వెల్లడించారు.