ఉక్రెయిన్‌పై గత రెండేళ్లుగా దండయాత్ర కొనసాగిస్తోన్న రష్యా.. తాజాగా చెర్నిహివ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. క్షిపణి దాడిలో ఎనిమిది అంతస్తుల భవనం కూలిపోగా.. 17 మంది మృతి చెందారు. అలాగే, ముగ్గురు చిన్నారులు సహా 61 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ విభాగం వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో రష్యా - బెలారస్ సరిహద్దులకు సమీపంలోని చెర్నిహీవ్ ప్రాంతంపై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటలకు ఈ దాడి చోటుచేసుకుంది. క్షిపణి దాడికి గురైన భవనంలో ఆస్పత్రి, ఓ విద్యా సంస్థ ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఆసుపత్రి లోపల పొగతో నిండిన కారిడార్‌లను ఖాళీ చేయడం, ఆసుపత్రి పడకలపై కిటికీలు పగిలిన గాజు పెంకులు, తలుపులు పడి ఉన్నట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్షిపణి భవనాలను ఢీకొనడంతో బస్‌స్టాప్ పక్కన పౌరులు దాక్కున్నట్లు మరొక వీడియోలో కనిపించింది. చనిపోయినవారిలో 25 ఏళ్ల పోలీస్ అధికారి లెఫ్టినెంట్ ఎలినా మ్యుకోలైట్స్ ఉన్నట్టు వెల్లడించారు.
ఫిబ్రవరి 24, 2022 నుంచి ఉక్రెయిన్‌తో జరుగుతోన్న ఈ యుద్ధంలో రష్యా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు అదనపు సైనిక సామాగ్రి, సహాయం నిలిపివేయడంతో రష్యాతో పోరాటంలో ప్రస్తుతం వెనుకబడుతోంది. ఈ క్రమంలో చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా తాము ఉక్రెయిన్‌కు ఐదు లక్షల ఫిరంగి షెల్స్‌ను పంపుతామని ప్రకటించారు. తమకు వాయు రక్షణ వ్యవస్థలను అందించాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అభ్యర్థించారు. తమకు తగిన గగనతల రక్షణ పరికరాలు ఇప్పటికే అంది ఉంటే.. రష్యా దాడులకు తిప్పికొట్టేవారమని అన్నారు. క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు తమ దగ్గరున్న గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను అయిపోయాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. కాగా ఇటీవల రష్యా .. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్‌లలో ఒకదానిని ధ్వంసం చేసింది.